‘రేషన్’కు ఎసరు!

5 Dec, 2013 03:03 IST|Sakshi

 తాడిపత్రి, న్యూస్‌లైన్ : తాడిపత్రి పట్టణంలో బోగస్ కార్డుల భాగోతం అధికారులను నివ్వెరపరుస్తోంది. రచ్చబండ-2 కార్యక్రమంలో దరఖాస్తు చేసిన వారిలో 3,960 మందికి తెల్లకార్డులు మంజూరయ్యాయి. వీటిని ‘రచ్చబండ-3’లో భాగంగా గత నెల 14 నుంచి పంపిణీ చేస్తున్నారు.
 
 20 రోజులవుతున్నా 300 మంది కూడా కార్డులను తీసుకెళ్లలేదు. కార్డులు మంజూరైనా చాలా మంది లబ్ధిదారులు రాకపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో రేషన్‌షాపుల వారీగా సర్వే ప్రారంభించారు. వీఆర్‌ఓలు సంబంధిత చిరునామాలకు వెళ్లి విచారణ చేస్తున్నారు. చాలా చోట్ల అలాంటి పేరు గల వ్యక్తులు లేకపోవడం, ఒకవేళ ఉన్నా అప్పటికే కార్డు ఉందని చెబుతుండడంతో విస్తుపోవడం వీఆర్‌ఓల వంతవుతోంది. ఇవన్నీ బోగస్ చిరునామాలు, పేర్లతో డీలర్లు సృష్టించారని గుర్తించిన అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టణంలో అధికార పార్టీ నేతల అనుచరులే డీలర్లుగా చలామణి అవుతున్నారు. వీరు గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారుల సహకారంతో మూడు వేలకు పైగా బోగస్ తెల్ల రేషన్‌కార్డులు సృష్టించారు. వీటికి ఇప్పటికే డిసెంబరు కోటా బియ్యం కూపన్లు మంజురయ్యాయి. పట్టణంలోని పదో నంబర్ షాపులో అత్యధికంగా 255 తెల్లకార్డులు మంజూరయ్యాయి. 7, 14, 19, 21, 24, 28, 32, 35, 41, 46, 48, 55 నంబర్ల షాపుల పరిధిలోనూ అత్యధికంగా బోగస్ తెల్లకార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఒక్కో షాపు పరిధిలో 20 కార్డులు కూడా పంపిణీ చేయలేదంటే బోగస్ కార్డులు ఏమేరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ డీలర్లకు కార్డులను ఎందుకు ఇవ్వడం లేదని అధికార పార్టీ నేతలు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వారు తలలు పట్టుకుంటున్నారు.
 
 ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి ఎక్కడ వెళుతుందోనని హైరానా పడుతున్నారు. కాగా.. రచ్చబండ-3లోనూ రేషన్‌కార్డుల కోసం ఐదు వేలకు పైగా దరఖాస్తులు అందాయి. వీటిలోనూ చాలా వరకు బోగస్ పేర్లతో దరఖాస్తు చేసి వుంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. బోగస్ కార్డులను సృష్టించే క్రమంలో డీలర్లు వారి పరిధిలోని కాలనీల్లో పర్యటించి చిరునామాలు సేకరించి (అతి)తెలివిగా వ్యవహరించినా ఎట్టకేలకు బండారం బట్టబయలవడంతో బెంబేలెత్తుతున్నారు.
 
 లబ్ధిదారులు రాకపోతే వెనక్కు పంపుతాం
 కార్డులపై ఉన్న చిరునామాల్లో చాలా మంది లేరని సిబ్బంది చెబుతున్నారు. మేం కార్డులను డీలర్లకు ఇవ్వకుండా మా సిబ్బంది ద్వారానే పంపిణీ చేస్తున్నాం. సరైన చిరునామా, తగిన ఆధారాలతో వచ్చిన వారికి మాత్రమే కార్డులు ఇస్తున్నాం. పంపిణీ కాగా మిగిలిన వాటిని డీఎస్‌ఓకు అందజేస్తాం. నాపై ఎలాంటి ఒత్తిళ్లూ లేవు.                                       
 - రామకృష్ణారెడ్డి, తహశీల్దార్, తాడిపత్రి.
 

మరిన్ని వార్తలు