ముంబయిలో శ్రీవారి ఆలయం

7 Apr, 2016 03:59 IST|Sakshi

స్థల పరిశీలన  మహారాష్ట్ర సీఎంను కలసిన టీటీడీ చైర్మన్, ఈవో


తిరుపతి: ముంబయి మహా నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించదలచిన శ్రీవారి ఆలయం, సమాచార కేంద్రం స్థలాలను టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముంబయిలో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన లేఖను అందజేశారు. ముంబయి నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ  పెరుగుతోందని, వారికి కావాల్సిన సౌకర్యాలను తిరుపతి, తిరుమలలో కల్పిస్తున్న వైనాన్ని ఆయనకు వివరించారు. అందులో భాగంగానే ముంబయిలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి స్థలం కేటాయిస్తే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.


అందుకు మహారాష్ర్ట సీఎం ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. త్వరలో జరగనున్న తమ మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై చర్చించి ఆమోదిస్తామని  ఫడ్నవీస్ హామీ ఇచ్చినట్లు చదలవాడ పేర్కొన్నారు. అనంతరం నవీ ముంబయిలోని బేలాపూర్ ప్రాంతంలోని 2.4 ఎకరాల స్థలాన్ని టీటీడీ చైర్మన్‌తో పాటు ఈవో, జేఈవో పోలా భాస్కర్ పరిశీలించారు. ఈ స్థలంలో అయితే ఆలయం, సమాచార కేంద్రం, ఈ-దర్శన్ కౌంటర్ల నిర్మాణానికి అనువుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కూడా టీటీడీ బృందం కలసి స్థల అంశాన్ని ప్రస్తావించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

 

whatsapp channel

మరిన్ని వార్తలు