రోడ్డు పనులకు డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీలు

12 Dec, 2014 01:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ.10 వేల కోట్లతో నిర్మించేందుకు గానూ డీపీఆర్(డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు) రూపొందించేందుకు వీలుగా అంచనాలు, డ్రాయింగ్స్ రూపొందించే బాధ్యతను కొన్ని కన్సల్టెన్సీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.22 కోట్లను కేటాయించింది.

జాతీయ రహదారుల నుంచి నగరంలోకి నేరుగా చేరుకునేందుకు ఎలివేటెడ్ వంతెలను నిర్మించాలని నిర్ణయించింది. రాజీవ్ రహదారిని అనుసంధానిస్తూ 20 కి.మీ. పొడవుతో ప్యారడైజ్ జంక్షన్ నుంచి వంతెన, బాలానగర్ నుంచి ఓఆర్‌ఆర్‌కు అనుసంధానిస్తూ 20 కి.మీ.పొడవుతో నర్సాపూర్ జంక్షన్ వద్ద వంతెనను నిర్మించాలని నిర్ణయించింది.

ఈ రెండింటి డీపీఆర్ కోసం నివేదికలు తయారీ బాధ్యతను కన్సల్టెన్సీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.5 కోట్లు కేటాయించింది. కన్సల్టెన్సీలను గుర్తించేదుకు రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీలు కె.బిక్షపతి, పి.రవీందర్‌రావు, చీఫ్ ఇంజినీర్ ఐ.గణపతిరెడ్డిలతో కమిటీ ఏర్పాటు చేసింది.
 

మరిన్ని వార్తలు