మరో రెండు రోజులు వర్షాలు

15 Oct, 2018 09:39 IST|Sakshi
తిత్లీ తుపాను దెబ్బకు కుప్పకూలిన కొబ్బరిచెట్లు

సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటంవల్ల మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆదివారం జారీ చేసిన హెచ్చరికలు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం వాసులను వణికిస్తున్నాయి. ఇప్పటికే తిత్లీ తుపాను ధాటికి తోటలు, ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులైన తాము వర్షం వస్తే ఎక్కడ తలదాచుకోవాలంటూ ఆందోళన చెందుతున్నారు.

‘వేలాది ఇళ్లు కూలిపోయి కుటుంబాలకు కుటుంబాలే కట్టుదుస్తులతో చెట్ల కింద పరాయి పంచన ఉంటున్నారు. ఇంకా వర్షం కురిస్తే మా పరిస్థితి ఏమిటి’ అని వారు బెంబేలెత్తిపోతున్నారు. ‘బంగాళాఖాతంలో ఒడిశా తీరంలోనూ, కర్ణాటక ప్రాంతంలోనూ ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటంవల్ల రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది’ అని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. 

కాగా, తిత్లీ తుపాను దెబ్బకు ఉద్దానం కకావికలైంది. జీడి, కొబ్బరి చెట్లు నేలమట్టయ్యాయి. తుపాను ధాటికి ఊళ్లన్నీ శ్మశానాన్ని తలపిస్తున్నాయి. తిత్లీ విధ్వంసం నుంచి ఇంకా కోలుకోకముందే మరోసారి వర్షాలు ఉద్దానం వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు