విదేశీ విహంగాలు కావవి మా ఇంటి ఆడపడుచులు

3 Nov, 2018 07:48 IST|Sakshi
చెట్లపై గుమిగూడిన పక్షులు

పుట్టిల్లు పుణ్యక్షేత్రమే వలస వెళ్లేది సైబీరియాకు..

తొలకరిని తీసుకువచ్చే శుభసూచికలు

వాటికి హాని తలపెడితే బడితెపూజే..

పుణ్యక్షేత్రం వాసుల అభిమాన సంప్రదాయం

‘అబ్బబ్బా.. ఈ రొద ఏంట్రా బాబూ.. ఎదవగోల.. మాయదారి పక్షులు..’ అని ప్రశాంతత కోరుకునే పెద్దవారు తిట్టుకోవడం.. ‘చిచ్చిచ్చీ.. ఎక్కడపడితే అక్కడ ఈ రెట్టలేంట్రా బాబూ.. కడుక్కోలేక చస్తున్నాం.. ఎప్పుడు పోతాయో ఏంటో..’ అని మహిళలు విసుక్కోవడం మామూలే. పెద్ద పెద్ద చెట్లు ఉండి.. పక్షుల గూళ్లు ఉండే చోట్ల సాధారణంగా సంధ్యా సమయాల్లో ఈ కిలకిల రావాలు, రెట్టల వల్ల చికాకులు స్థానికులకు మామూలే. కానీ పుణ్యక్షేత్రం గ్రామస్తులు వారందరికీ విరుద్ధం. ఆ గ్రామంలో పక్షులను తూలనాడితే బడితపూజ చేస్తారు. ఆ విహంగాలు మా ఆడపడుచులు. వాటిని పల్లెత్తుమాట అనడానికి వీలు లేదు. అవి ఏంచేసినా మేం ఇష్టంగా అనుభవిస్తాం. మా ఆడపడుచులని అనడానికి మీరెవరు? అని నిలదీస్తారు. ఆ పక్షులపై వారు చూపే ఆదరాభిమానాలు అనన్యసామాన్యం.

తూర్పుగోదావరి, రాజానగరం:  రాజమహేంద్రవరానికి అత్యంత చేరువలో ఉన్న పుణ్యక్షేత్రానికి ఏళ్లతరబడి వలస వచ్చే విదేశీ విహంగాలపై ఆ గ్రామస్తులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు హద్దుల్లేవు. నిజానికి వాటిని పురుడు పోసుకునేందుకు వచ్చిన ఆడపడచుల్లా భావిస్తారు. ఓపెన్‌ బిల్‌ బర్డ్స్‌గా పిలిచే ఈ పక్షులు ఏటా జూన్, జూలై మాసంలో క్రమం తప్పకుండా సైబీరియా నుంచి ఇక్కడకు వలస వస్తుంటాయి. వీటి ముక్కు మధ్యలో రంధ్రంగా ఉండటంతో స్థానికులు ‘చిల్లు ముక్కు కొంగ’లని కూడా పిలుస్తుంటారు. వందల కొలదీగా ఇక్కడకు వచ్చే ఈ పక్షులు ఇక్కడి ఊర చెరువు చుట్టూ ఉన్న కంచివిత్తనం చెట్ల పై గూళ్లు ఏర్పాటుచేసుకుని గుడ్లు పొదుగుతాయి. వాటి నుంచి పిల్లలు బయలు దేరిన తరువాత  డిసెంబర్, జనవరి మాసంలో (మాఘమాసంలో) సంతానంతో కలసి తిరిగి వెళ్లిపోతాయి.  

కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తారు
వీటిని విదేశీ పక్షులంటే పుణ్యక్షేత్రం వాసులు ఒప్పుకోరు. ఎందుకంటే అవి పుట్టింది ఇక్కడే కదా మరి. అందుకే వాటిని పుట్టింటికి పురిటికి వచ్చే ఆడపడచుల్లా భావించి ఆదరిస్తారు. నెత్తిమీద రెట్ట వేసినా, చంకన ఉన్న పసివాడు దుస్తుల్ని ఖరాబు చేసినట్టు భావిస్తారే కానీ చీదరించుకోరు. గూళ్లకు చేరుకునే సమయంలో ఆ పక్షుల కిలకిలరావాలను కోకిల గానం కంటే మిన్నగా ఆస్వాదిస్తారు. పొరపాటున గూళ్ల నుంచి పక్షి పిల్లలు జారి పడితే జాగ్రత్తగా తిరిగి ఆ గూళ్లలోనే చేరవేస్తారు. తరతరాలుగా ఈ గ్రామస్తులకు ఆ పక్షులతో అలాంటి అనుబంధం కొనసాగుతోంది. గ్రామానికి ‘పుణ్యక్షేత్రం’ అనే పేరు కూడా వీటిరాక వల్లే వచ్చిందేమోననే అనుభూతిని వ్యక్తం చేస్తూ, వాటి రాకను శుభకరంగా భావిస్తుంటారు. ఈ పక్షులు వస్తేనే తొలకరి పనులు ప్రారంభమవుతాయని ఇక్కడి వారి విశ్వాసం.

అకస్మాత్తుగా మయం కావడం మిస్టరీయే
గత ఏడాది ఆగస్టులో ఈ పక్షులు రాత్రికిరాత్రే అదృశ్యమవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పక్షులకు చల్లటి వాతావరణం ఉండాలని, కాని ఇక్కడ ఉష్టోగ్రతలు పెరిగిపోవడంతోనే వెళ్లిపోయాయని కొందరు, వలస వచ్చే వాటికి ఇక్కడ సరైన అనుకూలత లేకపోవడంతోనే మకాం మార్చి ఉంటాయని మరికొందరు.. ఇలా ఎవరికి తోచిన విధంగా చెప్పుకున్నారు, బాధపడ్డారు. ఈ నేపథ్యంలో తొలకరి సమయం ఆసన్నమవుతున్న సమయంలో తిరిగి వస్తాయోరావోనని భావించిన వారికి జూలై మాసంలో ఒక్కొక్కటిగా రావడం ఆనందం కలిగించింది.

విద్యుత్‌ తీగల రూపంలో పొంచివున్న మృత్యువు
15 ఏళ్ల క్రితం వరకూ ఎంతో సంతోషంగా పుట్టింటికి వచ్చివెళ్లే ఈ పక్షులకు తరువాతి కాలంలో విద్యుత్‌ తీగల రూపంలో ఆపద ముంచుకొచ్చింది. ఈ పక్షులు నివాసం ఉండే చెరువుకు సమీపంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం, అవి జీవించే చెట్ల మీదుగా హై టెన్షన్‌ విద్యుత్‌ వైర్లు వేయడంతో వాటి స్వేచ్ఛా జీవనానికి ఆటంకం ఏర్పడింది. దాంతో జెడ్పీ హైస్కూలు వెనుక ఉన్న ఊర చెరువు గట్టున ఉన్న కంచివిత్తనం చెట్లను నివాసాలుగా చేసుకున్నాయి. అయితే ఈ చెట్ల పైనుంచి విద్యుత్‌ శాఖ హైటెన్షన్‌ తీగలు వేయడంతో ఈ పక్షులు గాలిలోకి ఎగిరే సమయంలో ఆ తీగలకు తగులుకొని చాలావరకు చనిపోతున్నాయి. ఈ చెరువుపై నుంచి హైటెన్షన్‌ వైర్లను వేయవద్దని స్థానికులు అడ్డుపెట్టినా విద్యుత్‌ అధికారులు వినకపోవడంతో పలు సందర్భాల్లో పక్షులు మృతిచెందుతున్నాయి. భవిషత్తులోనైనా ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపి ఈ పక్షుల మనుగడకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు అధికారులనుకోరుతున్నారు.

బోర్డుతోనే సరిపెట్టిన అటవీ శాఖ
పుణ్యక్షేత్రంలో వలస పక్షుల సంరక్షణకు అటవీ శాఖ వైల్డ్‌ లైఫ్‌ విభాగం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో విదేశీ వలస కొంగల సందర్శన ప్రాంతం అని బోర్డును ఏర్పాటుచేసి, అటవీ శాఖ చేతులు దులిపేసుకుందని స్థానికులు విమర్శిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో అకస్మాత్తుగా పక్షులు మాయమైపోతే కారణం ఏమిటనే విషయాన్ని కూడా అటవీ శాఖ పట్టించుకోలేదన్నారు.

మరిన్ని వార్తలు