విదేశీ సంస్థలకు భవానీ ద్వీపం

22 Jun, 2015 02:45 IST|Sakshi
విదేశీ సంస్థలకు భవానీ ద్వీపం

అమితాసక్తి చూపుతున్న సింగపూర్
* కట్టబెట్టే యోచనలో ప్రభుత్వం

సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ పర్యాటకానికి మణిదీపంలాంటి భవానీ ద్వీపాన్ని విదేశీ సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. సింగపూర్ కంపెనీలకు దీంతోపాటు పక్కనే ఉన్న మరికొన్ని ద్వీపాలను లీజుకిచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సింగపూర్ కంపెనీలు చర్చలు జరిపాయి.

రాజధాని మాస్టర్‌ప్లాన్ హడావుడి పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఈ లీజుపై దృష్టి పెట్టనుంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణానదిలో 7 వేల ఎకరాల్లో పలు ద్వీపాలున్నాయి. ఇందులో 133 ఎకరాల భవానీద్వీపం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. రాష్ట్ర విభజనకు ముందే దీన్ని అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ ప్రణాళిక రూపొందించింది. ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో దీనిపై తనకు చాలా ప్లానింగ్ ఉందని పాత ప్రణాళికలను పక్కన పెట్టాలని స్వయంగా చంద్రబాబు పర్యాటక శాఖకు సూచించారు.

సింగపూర్‌లోని సెంటోసా ద్వీపం తరహాలో దీన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఆయన పలుమార్లు చెప్పారు. మాస్టర్‌ప్లాన్ తయారుచేసిన సింగపూర్ కంపెనీల్లో ఒకదానికి వాటిని అభివృద్ధి చేసి 33 ఏళ్లపాటు నిర్వహించుకునే అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిసింది.
 
గతంలో ఆందోళనలు నిర్వహించిన టీడీపీ
కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భవానీ ద్వీపాన్ని ప్రైవేటుకు లీజుకిచ్చే ప్రయత్నాన్ని టీడీపీ అడ్డుకుంది. ఆ ప్రయత్నం విరమించుకునే వరకూ అప్పటి టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆందోళనలు నిర్వహిం చారు. ఇప్పుడు ద్వీపాన్ని అభివృద్ధి చేయకుండా ఏకంగా విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టేందుకు సిద్ధమవుతుండడం విశేషం.

మరిన్ని వార్తలు