విదేశీ ఉద్యో‘గాలం’

16 Nov, 2013 02:25 IST|Sakshi

విశాఖపట్నం, న్యూస్‌లైన్: కువైట్ ఆయిల్ కంపెనీలో ఉద్యోగం. పెద్ద మొత్తంలో జీతం. ఇంకా మరెన్నో సదుపాయాలు.. అని నిరుద్యోగులకు ఆశ చూసి సుమారు రూ.6 కోట్ల వరకు వసూలు చేసి పరారయ్యాడు ఓ వ్యక్తి. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగుచూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయికి చెందిన విక్టర్ ఫ్రెడ్డీ డిసౌజా ‘క్వీనీటెక్ క్విక్ సొల్యూషన్స్’ పేరిట నాలుగు నెలల క్రితం ద్వారకానగర్ అరుణోదయ కాంప్లెక్స్‌లో కార్యాలయం ప్రారంభించాడు.

కువైట్‌లోని సీ డ్రిల్ ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలిప్పిస్తానని క్వికర్.కామ్, ఓఎల్‌ఎక్స్.కామ్, ట్విట్టర్.కామ్‌లో యాడ్స్ పోస్టు చేశాడు. రూ.30 వేల నుంచి రూ. 60 వేల వరకు జీతమని కంపెనీ ఫ్రొఫైల్ సైట్‌లో పొందుపరిచాడు. ఆకర్షితులైన బంగ్లాదేశ్, చెన్నై, బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది క్వీనీటెక్ ఉచ్చులో పడ్డారు. విశాఖకు చెందినవారు 25 మంది ఉన్నారు. వీరికి పలు దఫాలుగా ఇంటర్వ్యూలు, వైద్య పరీక్షలు నిర్వహించారు.

పోస్టును బట్టి ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆన్‌లైన్ ద్వారా వసూలు చేశారు.  సుమారు రూ. 6 కోట్లకు పైగా వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. తొలుత ఈ నెల 5న, తరువాత 11న వీసాలు వస్తాయన్నారని పేర్కొన్నారు. 14న డెరైక్ట్‌గా పంపిస్తామని సంస్థ నుంచి ఫోన్ రావడంతో ద్వారకానగర్‌లోని సంస్థ కార్యాలయానికి వచ్చినట్టు తెలిపారు. ఇక్కడ డిసౌజా లేకపోవడం, ఫోన్ ఆపేసి ఉండటంతో హెచ్‌ఆర్‌ని బాధితులు నిలదీశారు. తనకు సంబంధం లేదని ఆమె చేతులెత్తేయడంతో బాధితులు కార్యాలయంపై డాడికి దిగారు. అనంతరం ద్వారకాజోన్ పోలీసులను ఆశ్రయించారు. సీఐ ఎలియాబాబు కేసు నమోదు చేశారు.
 
 కువైట్‌లో ఉద్యోగమని..
 ట్విట్టర్‌లో యాడ్ చూశాను. కువైట్‌లో ఉద్యోగమని మా తమ్ముని కోసం రూ.లక్షన్నర కట్టాను. వీసా వచ్చేస్తుందంటూ రెండు వారాలుగా వాయిదా వేస్తున్నారు. గురువారం కచ్చితంగా నియామక ఉత్తర్వులు ఇస్తామన్నారు. తీరా డిసౌజా ఫోన్ ఆపేసి ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేశాం.
 -రవి, విశాఖపట్నం
 
 ఆకర్షణీయమైన జీతమని...

 క్వికర్‌లో యాడ్ చూశాను. కంపెనీ ప్రొఫైల్ చూసి నిజమని నమ్మాను. సీ డ్రిల్ కంపెనీలో ఆకర్షనీయమైన జీతమని డబ్బులు కట్టాను. ఎండీ డిసో జా పత్తా లేకుండా పోయాడు. హెచ్‌ఆర్‌ను నిలదీస్తే తాను ఉద్యోగినని...తనకెలాంటి సంబంధం లేదంటోంది.  దీంతో పోలీసులను ఆశ్రయించాను.
 -సంతోష్‌కుమార్, అక్కయ్యపాలెం
 

మరిన్ని వార్తలు