విదేశీ పెట్టుబడులతో ‘రక్షణ’కు ముప్పు!

15 Aug, 2013 00:04 IST|Sakshi

రక్షణరంగ నిపుణుడు రఘునందన్ హెచ్చరిక
 సాక్షి, హైదరాబాద్: రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల వల్ల మేలు జరగదు సరికదా.. నష్టం జరిగే అవకాశమే ఎక్కువని రక్షణరంగ విశ్లేషకుడు పి.రఘునందన్ చెప్పారు. ముఖ్యంగా రక్షణ రంగంలో స్వావలంబనకు విఘాతం కలిగే ప్రమాదముందన్నారు. లాభాలకోసం పెట్టుబడులు పెట్టే సంస్థలు మనకవసరమైన కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవ్వవని, ఫలితంగా ప్రతి చిన్న విషయానికీ విదేశీ కంపెనీలపై ఆధారపడటం పెరిగిపోతుందని చెప్పారు. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల్ని నిరసిస్తూ డీఆర్‌డీవో, రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ శివార్లలోని కంచన్‌బాగ్‌లో బుధవారం నిర్వహించిన సదస్సులో రఘునందన్ మాట్లాడారు. విదేశీ పెట్టుబడులవల్ల దేశీయ శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం కరువవుతుందని అఖిలభారత రక్షణ ఉద్యోగుల ఫెడరేషన్ కార్యదర్శి జి.టి.గోపాలరావు చెప్పారు. కార్యక్రమంలో మిధాని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డి.నారాయణరావు, డీఆర్‌డీవో యూనియన్ల సమన్వయకర్త బి.నరహరి, భారత్ డైనమిక్స్ ఉద్యోగుల సంఘం కో కన్వీనర్ ఎ.బాపూరావు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు