నిమ్మగడ్డ లేఖ బయటి నుంచే

6 May, 2020 04:21 IST|Sakshi

ఆ లేఖ ఎస్‌ఈసీలో తయారు కాలేదు.. సీఐడీకి అందిన ఫోరెన్సిక్‌ నివేదిక  

ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లను విశ్లేషించిన నిపుణులు

వివరాలు వెల్లడించిన సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌

రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ లేఖ వెనుక దాగి ఉన్న అనుమానాలు నిగ్గుతేలుతున్నాయి.తాజాగా ఆ లేఖ ఎస్‌ఈసీ కార్యాలయంలో తయారు కాలేదని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్ధారించింది.

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ లేఖ వెనుక దాగిన లెక్కలేనన్ని అనుమానాలు ఒక్కొక్కటిగా నిగ్గుతేలుతున్నాయి. కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రాసినట్లుగా చెబుతున్న లేఖకు సంబంధించి సీఐడీ దర్యాప్తులో ఇప్పటికే పలు కీలక విషయాలు రాబట్టింది. తాజాగా ఆ లేఖ ఎస్‌ఈసీ కార్యాలయంలో తయారు కాలేదని సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్ధారించింది. ఈమేరకు ఫోరెన్సిక్‌ నివేదిక సీఐడీకి చేరింది. కేసు దర్యాప్తులో తాజా పరిణామాలపై సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్‌ మంగళవారం  మాట్లాడుతూ ఏమన్నారంటే..

► రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు నిమ్మగడ్డ లేఖ పేరుతో కుట్ర జరిగిందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దర్యాప్తు చేపట్టాం. 
► ఎస్‌ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి మాటల్లో పరస్పర విరుద్ధమైన అంశాలున్నాయి. చాలా ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పలేకపోయారు. ‘లెటర్‌ టు హోం సెక్రటరీ’ అనే ఫైల్‌ను ఎందుకు ధ్వంసం చేశారంటే అది రహస్యం అన్నారు. మరి అంత రహస్యం అయితే ఆ లేఖ మీడియాలో యధాతథంగా ఎలా వచ్చిందనే ప్రశ్నకు సమాధానం లేదు. వెరీ కాన్ఫిడెన్షియల్‌ అనుకున్నప్పుడు ఆ లేఖ తాలూకు ఫైల్‌ ఒక్కటే డిలీట్‌ చేయాలి గానీ మొత్తం ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ సిస్టమ్‌ ఎందుకు డిలీట్‌ చేశారంటే జవాబు లేదు.
► సాంబమూర్తిని విచారించి నాలుగు పరికరాలు సీజ్‌ చేశాం. డెల్‌ ల్యాప్‌టాప్, లెనోవా డెస్క్‌టాప్, స్కానర్, మోటరోలా ఫోన్‌ను విశ్లేషణ కోసం సైబర్‌ ఫోరెన్సిక్‌కు పంపించాం. వీటిని పరీక్షించిన సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు అసలు వాటిలో ఎస్‌ఈసీ లేఖ తయారు కాలేదని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారు. వి.విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో వ్యక్తం చేసిన అనుమానాలకు బలం చేకూర్చే విధంగా సైబర్‌ ఫోరెన్సిక్‌ నివేదిక ఉంది.
► ఫోరెన్సిక్‌ నివేదికను బట్టి ఎస్‌ఈసీలో ఆ లేఖ తయారు కాలేదని తేలింది. ఆ లేఖ ముందుగానే తయారై బయటి నుంచి వచ్చిందని నిర్ధారణ అయింది. మార్చి 18వ తేదీ పెన్‌డ్రైవ్‌లో ఆ లేఖ రమేష్‌కుమార్‌ వద్దకు చేరింది.

వెలుగులోకి వాస్తవాలు
మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ లేఖ వెనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్ర దాగి ఉందని వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి నిమ్మగడ్డ రాసిన లేఖపై తొలి నుంచి అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైందనే ఆరోపణలున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ సందర్భంగా రమేష్‌ కుమార్‌ చేసిన సంతకానికి, కేంద్ర హోంశాఖకు పంపిన లేఖలో ఉన్న సంతకానికి పొంతన లేదని ఫిర్యాదులో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన సీఐడీ పలు కీలక ఆధారాలు సేకరించడంతో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 

‘ఎన్నికల కమిషనర్‌’ ఆర్డినెన్స్‌ వ్యాజ్యాల్లో విచారణ 7కి వాయిదా  
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్, తదానుగుణ జీవోలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు మంగళవారం హైకోర్టులో వాదనలను ముగించారు. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, కొత్త ఎన్నికల కమిషనర్‌ జస్టిస్‌ కనగరాజ్‌ తదితరుల వాదనలు వినేందుకు విచారణను కోర్టు ఈనెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం, శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్‌ వాదనలు వింటామని, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పిటిషనర్ల తరఫు న్యాయవాదుల తిరుగు సమాధానాలు వింటామని ధర్మాసనం పేర్కొంది.

మరిన్ని వార్తలు