మొక్కకూ దిక్కులేదు

22 Jul, 2014 02:02 IST|Sakshi

తాడేపల్లిగూడెం :  సీమాంధ్రను సింగపూర్ చేస్తాం.. మోడల్ రాజధాని నిర్మిస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న సర్కారు కనీసం మొక్కలు నాటేందుకైనా చర్యలు తీసుకోవడం లేదు. సామాజిక వన నర్సరీలకు పైసా కూడా విదల్చకపోవడంతో రోడ్ల పక్కన కనీసం మొక్కలైనా నాటే దిక్కులేకుండాపోరుుంది. రోడ్ల వెంబడి నీడనిచ్చే మొక్కలను నాటాల్సిన తరుణం ఇది. ఇలా నాటడానికి సామాజిక వన నర్సరీలలో మొక్కలు లేవు. అదేమంటే.. వాటిని పెంచడానికి రూకలు లేవు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇదే పరిస్థితి.

రాష్ట్ర విభజనను సాకుగా చూపుతూ జిల్లాలోని మూడు అటవీ డివిజన్‌లకు బడ్జెట్ కేటాయించలేదు. అప్పటినుంచి అధికారులు, సిబ్బంది సొంత సొమ్ము వెచ్చించి ముందుకు సాగుతున్నారు. మరోవైపు సామాజిక వన విభాగంలో ఔషధ మొక్కల పెంపకం నిలిచిపోరుుంది. వర్షాకాలానికి ముందే ఉపాధి హామీ పథకంలో కూలీలను కేటారుుంచి లక్షలాదిగా మొక్కలను నాటించి పెంచేవారు.

ఆ మొక్కల పెంపకాన్ని తామే చేపడతామని డ్వామా అధికారులు ముందుకొచ్చారు. దీంతో సామాజిక వన నర్సరీలలో మొక్కలు పెంచే అవకాశం లేకుండాపోయింది. డ్వామా అధికారులు చేపట్టిన మొక్కల పెంపకం పథకం మాడిపోయింది. ఏ మొక్క బతికి బట్టకట్టలేదు. మరోపక్క సామాజిక వన నర్సరీలలో మొక్కలు లేవు. దీంతో ఈ సీజన్‌లో జిల్లాలో రోడ్ల వెంబడి మొక్కలు నాటే పరిస్థితి లేదు.

 ఉపాధి లేదు.. పర్యావరణ పరిరక్షణా లేదు
 ఏటా ఉపాధి హామీ పథకంలో లక్ష వరకు మొక్కలను సామాజిక వన నర్సరీలలో పెంచేవారు. ఇందు కోసం ప్రతి నర్సరీకి 50 మంది కూలీలను కేటాయించే వారు. వీరంతా తుంగ, మోదుగ, జావల్లి, వెలగ, కానుగ, తుమ్మ, వేప, టేకు వంటి సుమారు 112 రకాల మొక్కలను పెంచేవారు. ఇవికాకుండా రోడ్ల వెంబడి నీడ, అందమైన పూలు ఇచ్చే అగ్నిపూలు చెట్లు పెంచేవారు.

నర్సరీలలో బ్యాగ్ నర్సరీ, బెడ్ నర్సరీలుగా విభజించి మొక్కలను పెంచేవారు. వీటిని తహసిల్దార్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాలు, స్వచ్ఛంద సంఘాల ద్వారా నాటడానికి వివిధ ప్రాంతాలకు పంపేవారు. చాలాకాలంగా ఇదే మాదిరి సాగుతోంది. గత ఏడాది బ్యాగ్ నర్సరీల నిర్వహణను తామే చేపడతామని డ్వామా అధికారులు ముందుకు వచ్చారు. దీంతో సామాజిక వన నర్సరీలు టేకు మొక్కలు పెంచే బెడ్ నర్సరీలుగా మారిపోయాయి. దీంతో జిల్లాలోని నరసాపురం, ఏలూరు, జంగారెడ్డిగూడెం అటవీ రేంజ్‌ల పరిధిలోని సామాజిక వన నర్సరీలు బోసిపోయాయి.

ఒకప్పుడు ఔషధ మొక్కల పెంపకానికి చిరునామాగా మారిన తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలోని నర్సరీ పిచ్చిమొక్కలకు నిలయంగా మారింది. అందమైన మొక్కలు లేవు. క్లోనింగ్ యూకలిప్టస్ మొక్కల కోసం వేచిన షేడ్ నెట్‌లు పిచ్చిమొక్కల నిలయాలుగా మారాయి. అందులోని రహదారులు పాముల పుట్టలతో దర్శనమిస్తున్నారుు. వర్షాలు రాగానే జిల్లాలో సుమారు 80 కిలోమీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా నీడనిచ్చే మొ క్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేవారు. రాష్ట్రం విడిపోరుుందని, దీనివల్ల నిధులు  లేవనే సాకుతో లక్ష్యా న్ని 20 కిలో మీటర్లకు కుదించారు. దానికి కూడా నిధులు కేటాయించలేదు.

మరిన్ని వార్తలు