దైవ దర్శనానికి వస్తే దొంగలను చేస్తారా

23 Dec, 2014 02:20 IST|Sakshi
దైవ దర్శనానికి వస్తే దొంగలను చేస్తారా

* పశువుల కంటే హీనంగా కొట్టారు
* కన్నీరు పెట్టుకున్న తమిళులు

 ప్రొద్దుటూరు క్రైం: జ్యోతి క్షేత్రానికి వస్తే మంచి జరుగుతుందని ఇక్కడికి వచ్చాం.. అయితే ఇక్కడి అటవీశాఖ అధికారులు మమ్మల్ని దొంగల్ని చేశారు.. పశువుల కంటే హీనంగా కొట్టారు .. అంటూ తమిళులు కన్నీరు పెట్టుకున్నారు. వనిపెంట అటవీశాఖ అధికారుల అదుపులో ఉన్న తమిళులు ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ సోమవారం ఉదయం జిల్లా ఆస్పత్రికి చేరుకుని వారిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

దర్శనానికి వస్తే ఎర్రచందనం స్మగ్లర్‌లమని అదుపులోకి తీసుకుని నాలుగు రోజులపాటు పశువుల కంటే ఘోరంగా కొట్టారని వారు వివరించారు. తామందరం పనులు చేసుకునే వాళ్లమని కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని ఆమె ముందు వాపోయారు. తమ వద్ద ఉన్న రూ. 42 వేలతో పాటు సెల్‌ఫోన్‌లను కూడా లాక్కున్నారని తెలిపారు. కేవలం తమిళం మాట్లాడుతున్నామనే మమ్మల్ని ఇలా అదుపులోకి తీసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇళ్లు అడవిలో ఉంది.. ఇంటి వద్ద భార్యా పిల్లలు ఉన్నారు.. వారికి ఏం కావాలన్నా నేనే తీసుకుని వెళ్లాలి.. ఐదారు రోజుల నుంచి అన్నం లేకుండా ఎలా ఉన్నారో అంటూ సెల్వరాజ్ ఆస్పత్రిలో జయశ్రీ ముందు రోదించసాగాడు.
 
అటవీశాఖ అధికారులకు దర్యాప్తు పట్టదా..

ఆస్పత్రిలో తమిళులతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్న అనంతరం జయశ్రీ విలేకరులతో మాట్లాడారు. నేరంతో సంబంధం ఉందో లేదో తెలియడానికి దర్యాప్తు చేస్తారన్నారు. అయితే అటవీశాఖ అధికారులు ఎలాంటి విచారణ లేకుండా జ్యోతి క్షేత్రానికి వెళ్లి వస్తున్న తమిళులను అదుపులోకి తీసుకొని ఎర్రచందనం దొంగలుగా చిత్రీకరించడం విచారకరమని ఆమె తెలిపారు. వారిని ఈ నెల 17న అక్రమంగా అరెస్ట్ చేయడమేగాక విచక్షణా రహితంగా చితక్కొట్టారన్నారు.  వారి వద్ద కొడవళ్లు దొరికాయని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు.
 
ఆరు మంది తమిళులకు రిమాండ్
వనిపెంట రేంజిలో అరెస్టు చేసిన ఆరు మంది తమిళులను సోమవారం అటవీశాఖాధికారులు కోర్టుకు హాజరుపరిచారు. తమిళనాడుకు చెందిన కెప్టెన్ ప్రభాకర్, మోహన్, సెల్వరాజ్, కృష్ణకుమార్, సుబ్రమణి కుమార్‌లు వనిపెంట వైపు వస్తుండగా ఈనెల ఈనెల 17న వనిపెంట అటవీశాఖాధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో వారిలో కెప్టెన్ ప్రభాకర్, మోహన్, సెల్వరాజ్‌లు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వీరినికేసు నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారు కోలుకోవడంతో వైద్యులు సోమవారం డిశ్చార్జి చేశారు. ఈమేరకు పోలీసులు సోమవారం వారిని కోర్టుకు హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు డీఎఫ్‌ఓ శివశంకరరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు