అడవితల్లి కన్నీరు

9 Feb, 2019 08:14 IST|Sakshi
ఎగువశెంబి సమీపంలో నరికిన అటవీప్రాంతం

తరిగిపోతున్న అటవీ సంపద

గిరిపుత్రులు కూటికోసం, అక్రమార్కులు సంపాదన కోసం అడవిని నరుకుతున్న వైనం

చెట్లు తరగుతుండడంతో జనారణ్యంలోకి ప్రవేశిస్తున్న    జంతువులు

విజయనగరం, సాలూరు రూరల్‌: అడవితల్లి కన్నీరు పెడుతోంది. సాలూరు మండలంలోని అడవుల్లో  విలువైన వృక్ష సంపద రోజురోజుకూ తరిగిపోతోంది. కొందరు వ్యక్తుల ధనదాహానికి వనదేవత నిలువునా  దహించుకుపోతోంది. సాలూరు రేంజ్‌ పరిధలోని పాచిపెంట, మక్కువ మండలాల్లో సుమారు 26 వేల హెక్టార్లు అటవీప్రాంతం ఉంది. అయితే, అందులోని చెట్లు రోజురోజుకూ తరిగిపోతుండడం గిరిజనులు, పర్యావరణ ప్రేమికులను ఆవేదనకు గురిచేస్తోంది.

అడవుల నరికివేత....
గిరిజనులకు అడవే ఆధారం. గిరిపుత్రులు వారి జీవనం కోసం కొద్దిమేర  చెట్ల కొమ్మలును నరికి కట్టెలుగా మార్చి అమ్మకాలు సాగిస్తారు. ఆ సొమ్ముతో జీవితాన్ని వెళ్లదీస్తారు. అయితే, కొందరు వ్యాపారులు డబ్బులు ఎరజూపి గిరిజనులతోనే అడవులను నరికివేయించి రాత్రిపూట విలువైన కలపను సరిహద్దులు దాటిస్తున్నారు. రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. హుద్‌హుద్‌ తుపానుకు కూలిన చెట్లన్నింటినీ ఇలాగే తరలించేశారు. దీనికి అప్పటి అటవీశాఖ అదికారులు, సిబ్బంది వ్యాపారులకు సహకరించినట్టు సమాచారం. ఇప్పుడు అటవీ ప్రాంతంలోని వెదుర్లు, టేకు  లాంటి వాటిని అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. వెదురు వ్యాపారం జోరందుకుంది. వాస్తవంగా వెదురు కొనుగోలుకు సారిక వద్ద ప్రభుత్వ పరంగా ఓ డీలర్‌ను నియమించారు. అయితే, దళారులు గిరిజనులకు కొంత ముట్టజెప్పి వెదురును భారీ స్థాయిలో తరలిస్తున్నారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఉన్న అడవిని యథేచ్ఛగా ఒడిశా ప్రాంతవాసులు కొల్లగొడుతున్నారు. ఈ కలపను కొఠియా గ్రామం మీదుగా తరలిస్తున్నారు. 

జనావాసంలోకి జంతువులు...
అడవి రోజురోజుకు తరిగిపోతుండడంతో అడవిలో నివసించే జంతువులు జనారణ్యంలోకి చేరుతున్నాయి. అడవి మేకలు, కోతులు జనావాసంలోకి విరివిగా వస్తున్నాయి. 2015లో రెండు అడవి ఏనుగులు ఇలానే మండలంలోకి  వచ్చాయి. తోణాం పంచాయతీ కుడకారు గ్రామంలో ఒక అడవి పంది జనారణ్యంలోకి వచ్చి బాలుడుని గాయపరచడం, మావుడి గ్రామంలో కొండచిలువ కొన్ని మేకలను చంపడం, ధూళిభద్ర సమీపంలో ఓ యువకుడిపై ఎలుగుబంటి గతంలో దాడి చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవల కొమరాడ మండలంలో  ఏనుగులు జనావాసంలోకి రావడానికి కూడా ఇదే కారణం. ఇప్పటికైనా అధికారులు స్పందించి అడవిని సంరక్షించాలని వన ప్రేమికులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం  
అటవీశాఖ అనుమతులు లేకుండా అక్రమంగా అడవిలోని చెట్లను నరికి తరలిస్తే ఏపీ ఫారెస్ట్‌ యాక్టు 1967, అటవీ పరిరక్షణ చట్టం 1980, వాల్టా చట్టం కింద చర్యలు తీసుకుంటాం. ఉన్న అడవిని పరిరక్షించడంతో పాటు, ఉపాధిహామి ద్వారా విత్తనాలు వేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నాం. అడవిలో  తేమ శాతం పెరిగేందుకు కందకాలు, చెక్‌డ్యాంలు, రాతి కట్టడాలు చేయిస్తూ అటవీ సంరక్షణకు కృషి చేస్తున్నాం.– అమ్మన్నాయుడు, సాలూరు ఫారెస్టు రేంజర్‌

మరిన్ని వార్తలు