ఏసీబీ వలలో ఫారెస్ట్‌చేపలు

11 Jan, 2014 02:07 IST|Sakshi
ఏసీబీ వలలో ఫారెస్ట్‌చేపలు
  • దొరికిపోయిన సెక్షన్ అధికారి, బీట్ ఆఫీసర్
  •  రూ. 15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇద్దరు ఉద్యోగులు
  •  కలప వ్యాపారి ఫిర్యాదు ఫలితం
  •  
     అరకులోయ, న్యూస్‌లైన్ : ఆమ్యా మ్యా ముట్టజెప్పందే కలప తరలింపు కుదరదన్నారు. హైకోర్టు ఉత్తర్వు ఉందని మొత్తుకున్నా మాకేమిటన్నారు. కలప కదలాలంటే క్యాష్ పడాల్సిందేనని పట్టుబట్టా రు. చివరికి ఏసీబీ పన్నిన ఉచ్చులో చిక్కుకుని ఉసూరంటున్నారు. అరకులోయ అటవీ శాఖ టెరిటోరియల్ రేంజిలో పని చేస్తున్న ఇద్దరు అటవీ శాఖ అధికారులు  శుక్రవారం లంచం పుచ్చుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు.

    ఏసీబీ డీఎస్పీ ఎం.నరసింహారావు అందించిన వివరాల ప్రకారం  విజయనగరం జిల్లా సాలూరు మండలం సామంతవలస గ్రామానికి చెందిన టి.వి.శివరావు అనే కలప వ్యాపారి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులు పెంచుతున్న నీలగిరి చెట్లను కొనుగోలు చేసి మైదాన ప్రాంతానికి తరలిస్తూ ఉంటారు. అటవీ శాఖ ఉద్యోగులు నిత్యం ఇబ్బందులు పెడుతూ ఉండడంతో వ్యాపారి హైకోర్టును ఆశ్రయించి  నీలగిరి దుంగలను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి  తరలించడానికి అనుమతి పొందారు. కానీ ఇద్దరు ఉద్యోగులు మళ్లీ అడ్డుపడ్డారు.

    కోర్టు అనుమతితో తమకు సంబంధం లేదని, అటవీ శాఖ అనుమతి లేకుండా తరలిస్తున్నందుకు ఒక లోడుకు  రూ. 20 వేలు లంచం కావాలని సుంకరమెట్ట సెక్షన్ అధికారి వి.వి నాయుడు, బీట్ ఆఫీసర్ పి.అప్పలరాజు శివరావును డిమాండ్ చేశారు. దీంతో వ్యాపారి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. రూ. 15 వేలు ఇస్తానని అధికారులతో  ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈలోగా ఏసీబీ అధికారులు వల పన్ని అరకులోయ అటవీశాఖ కార్యాలయం ఆవరణలో శుక్రవారం సాయంత్రం  మాటు వేశారు.

    కార్యాలయంలోనే వారిద్దరూ రూ. 15 వేలు నగదు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి డబ్బు స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ చెప్పారు.  వారి గదిలో ఉన్న రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. డుంబ్రిగుడ ఎస్‌ఐ మురళీకృష్ణ ఏసీబీకి పట్టుబడ్డ సంఘటన మరువక ముందే ఇద్దరు అటవీ శాఖ ఉద్యోగులు ఏసీబీకి పట్టు బడడంతో అవినీతి ఉద్యోగులు హడలెత్తుతున్నారు.
     
    లంచం అడిగితే ఫిర్యాదు
     లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని, ఎవరు లంచం అడిగినా  వెంటనే తమకు సమాచారం అందివ్వాలని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. 9440446170 నంబర్‌కు ఫోన్ చేయాలని చెప్పారు.
     
     చాలా ఇబ్బంది పెట్టేవారు

     నీలగిరి దుంగలను తరలించడానికి అటవీ శాఖ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పెట్టారు. అందుకే ఏసీబీని ఆశ్రయించవలసి వచ్చింది. కోర్టు అనుమతితోనే వృక్షాలను నరికించి తరలిస్తున్నాను.
     శివరావు, కలప వ్యాపారస్తుడు,  సాలూరు, విజయ నగరం జిల్లా.
     

మరిన్ని వార్తలు