అనుమతి గోరంత..ఎత్తుకెళ్లింది కొండంత

8 Mar, 2016 04:12 IST|Sakshi
అనుమతి గోరంత..ఎత్తుకెళ్లింది కొండంత

వెలుగుచూసిన బెజవాడ పాపిరెడ్డికాలువ మట్టి కుంభకోణం
ముడుపుల మత్తులో సోమశిల అధికారులు
రోడ్డు కాంట్రాక్ట్ కంపెనీ అడ్డగోలు వ్యవహారం
ఆందోళనలో అన్నదాతలు

 
 కాంట్రాక్ట్ కంపెనీ కక్కుర్తి.. అధికారుల నిర్లక్ష్యం కావలి కాలువకు శాపంగా మారింది. కట్టకు పెట్టని గోడలా ఉండాల్సిన సిల్టు రోడ్డు పనులకు తరలుతోంది. మట్టి తరలింపు విషయం తెలిసి రైతులు గగ్గోలుపెడుతున్నారు. కాలువ పటిష్టతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా కట్టింది కొంచెం.. తీసుకెళ్లేది భారీగా అన్నట్లుగా 20 వేల క్యూబిక్ మీటర్లకు డబ్బు కట్టి లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా మట్టిని  ఇప్పటికే తరలించుకెళ్లినా ఇరిగేషన్ అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
 

 
 సంగం: 75 వేల ఎకరాల అధికారిక ఆయకట్టు, 50 వేల ఎకరాల అనధికారిక ఆయకట్టు ఉన్న బెజవాడ పాపిరెడ్డి కాలువ (కావలి కాలువ) స్వార్థపరులకు భోజ్యంగా మారింది. సంగం సమీపంలోని పెన్నానది నుంచి 56 కిలోమీటర్ల దూరం వరకు సాగునీరు, తాగునీరు అందించే బెజవాడ పాపిరెడ్డి కాలువ గట్టు మీద ఉన్న సిల్టు(మట్టి)పై నెల్లూరు-ముంబై రోడ్డు విస్తరణ పనులు చేస్తున్న కాంట్రాక్టు కంపెనీ దృష్టిపడింది. రోడ్డు నిర్మాణం కోసం లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అవసరం కావటంతో సోమశిల అధికారులతో సంప్రదింపులు జరిపారు. సోమశిల అధికారులకు కంపెనీకి మధ్య దళారిగా దగదర్తి మండలానికి చెందిన టీడీపీ నేత వ్యవహరించినట్లు సమాచారం. భారీ ముడుపులు తీసుకుని సోమశిల అధికారులకు కంపెనీకి ఒప్పందం కుదిర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఒప్పందాల్లో భాగంగా క్యూబిక్ మీటర్ మట్టి, సిల్టుకి రూ.30వంతున కంపెనీ 20 వేల క్యూబిక్ మీటర్లు తీసుకునే విధంగా రూ.6 లక్షలు అధికారికంగా ఇచ్చారు. ఈ అనుమతి కాగితాన్ని ఆయుధంగా మార్చుకుని కాంట్రాక్టు కంపెనీ 6 భారీయంత్రాల సహాయంతో రాత్రి పగ లు తేడా లేకుండా లక్ష క్యూబిక్ మీటర్లకుపైగా మట్టి ని సోమవారానికి తరలించారు. మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్న సోమశిల అధికారులు ఆ చాయలకు కూడా రాకపోవడం కొసమెరుపు. ఆది, సోమవారాలు సెలవు దినాలు కావడంతో అధికారులు ఉండరన్న ఉద్దేశంతో భారీగా మట్టిని తరలిస్తుంది.


 ఆందోళనలో అన్నదాతలు
బెజవాడ పాపిరెడ్డి కాలువ (కావలి కాలువ) సంగం నుంచి దగదర్తి, బోగోలు, జలదంకి, కావలి మండలాల్లో రైతులకు సాగునీరు, కాలనీవాసులకు తాగునీరు అందిస్తుంది. ఇటీవల ఓ అధికారపార్టీ నేత ఈ కాలువ పనులను అస్తవ్యస్తంగా చేశారు. దీంతో కాలువ కట్టలకు రెయిన్‌కట్స్ పడుతున్నాయి. దీంతో నే ప్రమాదం జరుగుతుందని భయపడుతుంటే కట్టపై ఉన్న మట్టిని కూడా అమ్ముకోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువపై మట్టినే కాక కట్టలను ైసైతం యంత్రాల సహాయం తో ధ్వంసం చేస్తున్నా సోమశిల అధికారులు మీనమేషాలు లెక్కబెడుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువపై మట్టిని అమ్ముకుంటే భవిష్యత్‌లో కాలువకు గండిపడితే పూడ్చేందుకు కూడా మట్టి దొరకదని వాపోతున్నారు. ఇప్పటికైనా సోమశిల అధికారులు ముడుపుల మత్తులో నుంచి బయటకు వచ్చి కాలువపై మట్టిని అమ్ముకోవడం మానుకోవాలని రైతులు కోరుతున్నారు.


 అటవీభూముల్లో సైతం మట్టి తరలింపు
 కాంట్రాక్టు కంపెనీ రోడ్డు విస్తరణ పనుల కోసం అనుమతి లేకుండానే సంగం కొండ మట్టిని తరలించింది. అనుమతులు లేకుండా ఆ కంపెనీ అటవీశాఖ పరిధిలోని సంగం కొండ మట్టి తరలించడంపై అటవీశాఖ అధికారులు స్పందించి సంఘటన స్థలానికి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. యంత్రాలు, టిప్పర్లు సీజ్ చేయబోయారు.

 ఇంతలో అధికార పార్టీకి చెందిన ప్రముఖ నేత నుంచి ఫోన్ రావడంతో కేసులు నమోదు చేయకుండా ఇకపై అనుమతులు లేకుండా అటవీ భూముల్లో మట్టి తరలిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో మట్టి అవసరానికి ఆ కంపెనీ సోమశిల అధికారులను తమ బుట్టలో వేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు