చేతికి చిక్కినట్లే చిక్కి పారిపోయిన చిరుత

14 Feb, 2019 16:58 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : గత కొద్ది రోజులుగా జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న చిరుత పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారుల చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చేతికి చిక్కినట్టే చిక్కి పారిపోయింది. ముమ్మడివరం మండలం గేదెల్లంకలోని ఒ కొబ్బరితోటలో ఉన్నగుడిసెలో దూరిన చిరుతకు వైద్యులు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ మత్తు మందు పని చేయకపోవడంతో చిరుత తప్పించుకుంది. అటవీ అధికారులు చిరుతను బంధిస్తుండగా ఒక్కసారిగా గాండ్రించి అక్కడి నుంచి పారిపోయింది. చిరుత పరారీతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. (తూర్పుగోదావరిని వణికిస్తున్న చిరుతపులి)

ఈ నెల 4వ తేదీన అంకంపాలెం గ్రామంలో చిరుత పులి బీభత్సం సృష్టించి నలుగురిని గాయపరిచి చెట్టుపైకి చేరిన సంగతి తెలిసిందే. అయితే చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు లైట్లు ఆపివేయడంతో చిరుత తప్పించుకుని పొలాల్లోకి పారిపోయింది. అక్కడినుంచి పరారైన చిరుతపులి...ఇప్పుడు ముమ్మడివరం మండలం గేదెల్లంకలో ప్రత్యక్షమైంది. సమయం గడుస్తున్నా చిరుతను బంధించకపోవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత ఎక్కడ తప్పించుకుని, మళ్లీ దాడికి దిగుతుందేమో అని భయంతో వణికిపోతున్నారు.

మరిన్ని వార్తలు