పులుల సంరక్షణపై దృష్టి

9 Apr, 2020 12:23 IST|Sakshi

కరోనా నేపథ్యంలో అప్రమత్తమైన అటవీ శాఖ

నల్లమల పరిధిలో పులుల ఆరోగ్య పరిస్థితి అంచనా!

ఇతర వన్యప్రాణులపైనా దృష్టి

కర్నూలు(అగ్రికల్చర్‌): కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ బారిన పులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణులు పడకుండా అటవీ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్‌లో పులులకు కూడా కరోనా సోకినట్లు తెలియడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పులులు, చిరుతలతో పాటు ఇతర వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అటవీ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

నల్లమలలో 48 పెద్ద పులులు
జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో 48 పెద్ద పులులు ఉన్నాయి. వీటి సంరక్షణ చర్యల్లో భాగంగా 300 వరకు కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు.  పులులు నీటిని తాగడానికి వచ్చే కొలనులు, వాగులు తదితర ప్రాంతాల్లో వీటిని అమర్చారు. పులులు, చిరుతలతో పాటు అన్ని వన్యప్రాణుల కదలికలు, వాటి శబ్దాలు సైతం ఇందులో రికార్డు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పులులతో పాటు ఇతర వన్య ప్రాణుల ఆరోగ్య పరిస్థితిని కెమెరా ట్రాప్‌ల ద్వారా పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా పులులు చలాకీగా ఉన్నాయా, లేదా? దగ్గు, తుమ్ములు వంటి అనారోగ్య లక్షణాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాలను పరిశీలించనున్నారు. ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే తగిన జాగ్రత్తలు చేపడతారు. తాగే నీళ్లలో మందు కలపడం వంటి చర్యల ద్వారా రోగ నివారణకు చర్యలు తీసుకోనున్నారు. అలాగే కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో వన్యప్రాణుల ఆరోగ్య పరిస్థితులను క్షేత్రస్థాయిలోనూ అంచనా వేసేందుకు నల్లమల అటవీ ప్రాంతంలోకి ఫారెస్ట్‌ సిబ్బంది టీమ్‌లుగా వెళుతున్నట్లు ఆత్మకూరు డీఎఫ్‌ఓ వెంకటేశులు తెలిపారు. ఇదే సమయంలో సాధారణ వ్యక్తులెవరూ వెళ్లకుండా చూస్తున్నామన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే వన్య ప్రాణులకు దూరంగా ఉండటంతో పాటు మాస్క్‌లు కూడా ధరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు