అడవిని తలపిస్తున్న మహిళా ప్రాంగణం

5 Feb, 2014 03:21 IST|Sakshi

 నెల్లూరు (పొగతోట), న్యూస్‌లైన్: మహిళలకు స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన మహిళా ప్రాంగణం అడవిని తలపిస్తూ భయాందోళన కలిగిస్తోంది. నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో మహిళా ప్రాంగణాన్ని నిర్మించారు. విశాలమైన ప్రాంగణంలో చెట్లు విపరీతంగా పెరిగి అడవిని తలపిస్తోంది. విష పురుగులు సంచరిస్తుండటంతో మహిళలు భయపడుతున్నారు. ఈ ప్రాంగణంలో విద్యార్థులకు, మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమారు 90 మంది గ్రామీణ విద్యార్థినులకు మూడు నెలలుగా కుట్టు శిక్షణ, మిగిలిన అంగన్‌వాడీ కార్యకర్తలకు న్యూట్రిషన్‌పై శిక్షణ ఇస్తున్నారు. ఆదరణ లేని మహిళలు, వితంతువులు అనేక మంది ప్రాంగణంలో ఆశ్రయం పొందుతున్నారు.
 
 సుమారు 200 మంది మహిళలు, విద్యార్థినులు ప్రాంగణంలో ఉంటూ ఉపాధి కోర్సులో శిక్షణ తీసుకుంటున్నారు. ఇంత ప్రాధాన్యం ఉన్న ప్రాంగణం ముళ్ల చెట్లు, పిచ్చి చెట్లు పెరిగి విషపురుగులకు నిలయమైంది. రాత్రి వేళల్లో వారు వెలుపలికి రావాలంటే ఆందోళనకు గురవుతున్నారు. ప్రాంగణం ఆవరణలో ఏర్పాటు చేసిన వీధిలైట్లు సక్రమంగా వెలగడం లేదు. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినులకు ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. హాస్టల్ మరమ్మతులకు గురైంది. వర్షం పడితే పైకప్పు ఉరుస్తుంది. హాస్టల్ మరమ్మతులకు రూ.8.50 లక్షలు జిల్లా పరిషత్ నిధుల నుంచి కేటయించారు.
 
 ఇంత వరకు పనులు ప్రారంభం కాలేదు. పంచాయతీరాజ్ శాఖకు పనులు అప్పగించారు. సేవా సదన్‌లో ఆదరణలేని మహిళలు జీవనం సాగిస్తున్నారు. 100 మందికి పైగా మహిళలు సేవాసదన్‌లో ఉంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాంగణం అడవిని తలపిస్తోంది. సేవాసదన్ మహిళలతో అక్కడి భూమిలో కూరగాయలు సాగు చేసేలా చర్యలు తీసుకుంటే వారికి ఆదాయం లభిస్తుంది. ప్రాంగణంలో చెట్లను తొలగించడంతో పాటు విద్యుత్ లైట్లు సక్రమంగా వెలిగేలా జిల్లా అధికారుల చర్యలు తీసుకోవాలని మహిళలు, విద్యార్థినులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు