ఫారం–7 ఇవ్వడం తప్పుకాదు 

8 Mar, 2019 02:23 IST|Sakshi

వెరిఫికేషన్‌ కోసం వాటిని ఇస్తారు

ఫారం–7 ఇచ్చినంత మాత్రాన ఓట్లు తొలగించం

విచారణ జరిపిన తరువాతే వాటిపై నిర్ణయం

ఇప్పటివరకు 10 వేల ఓట్లు మాత్రమే తొలగించాం

మరో 40 వేల ఓట్లు తొలగించేందుకు అనుమతించాం

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది

సాక్షి, అమరావతి: రెండేసి చోట్ల ఓట్లు ఉన్నట్టు, దొంగ ఓట్లు ఉన్నట్టు తెలుసుకుని వాటిని తొలగించాలని కోరుతూ ఫారం–7 ఇవ్వడం తప్పు కాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. వెరిఫికేషన్‌ కోసం వాటిని ఇస్తారని ఆయన తెలిపారు. ఫారం–7 ఇచ్చినంత మాత్రాన ఓట్లు తొలగించబోమన్నారు. ఫారం–7 కింద ఇచ్చిన దరఖాస్తులపై విచారణ జరిపిన తరువాత మాత్రమే.. వాస్తవమైతేనే ఆ ఓట్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఫారం–7 ఇవ్వడం నేరమంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో  వాస్తవం లేదని ద్వివేది మాటలను బట్టి స్పష్టమవుతోంది. ఫారం–7 అనేది ఓటరుకు తెలియకుండా ఆ ఓటరు పేరు మీదనే ఇంకొక వ్యక్తి ఇవ్వడాన్ని మాత్రమే ద్వివేది తప్పుపట్టారు. ఇలాంటి తప్పుడు ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని, దీంతో దరఖాస్తులు తగ్గిపోయాయని తెలిపారు. ఫారం–7 దరఖాస్తులు ఎన్ని వచ్చినా నష్టం లేదన్నారు. ఇప్పటి వరకు పదివేల ఓట్లు మాత్రమే తొలగించామని తెలిపారు. ఫారం–7 దరఖాస్తుల్లో 40 వేల ఓట్లను తొలగించేందుకు మాత్రమే అనుమతించామని చెప్పారు. ఫారం–7 దరఖాస్తును ఆన్‌లైన్‌లో చేస్తే ఓటు తొలగించినట్లు కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా కంటే ఓటరు నిష్పత్తి తక్కువగా ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన యువతలో ఎక్కువ మందికి ఓటుహక్కు లేదని గుర్తించామని, వారందరూ ఓటర్లుగా నమోదు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా పనిచేస్తుందని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ద్వివేది స్పష్టం చేశారు.

45 వేల మంది సిబ్బందితో దరఖాస్తుల పరిశీలన..
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫారం–7 దరఖాస్తులు వచ్చాయి. డేటా చోరీ కేసు బయటకు వచ్చిన తరువాత ఫారం–7 దరఖాస్తులు తగ్గుముఖం పట్టాయి. మొత్తం 8.76 లక్షల ఫారం–7 దరఖాస్తులు వచ్చాయి. వీటిని 45 వేల మంది సిబ్బందితో నిరంతరంగా పరిశీలన చేయిస్తున్నారు. ఇప్పటివరకు 1,61,005 దరఖాస్తులను పరిశీలన చేయగా అందులో 5,309 మాత్రమే అసలైన దరఖాస్తులుగా నిర్ధారించారు. 1,55,696 దరఖాస్తులను నకిలీవిగా గుర్తించి తిరస్కరించారు. దరఖాస్తుల పరిశీలనను మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం పూర్తి చేయనుంది. కాగా, ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.  

మరిన్ని వార్తలు