కన్నీటి వాన

26 Oct, 2013 03:27 IST|Sakshi

పాలమూరు, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రైతన్నకు కన్నీళ్లను మిగిల్చాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలు పంటలను ముంచెత్తడంతో అన్నదాత అవస్థలు ఎదుర్కొంటున్నాడు. పలు ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిని జనం నిరాశ్రయులయ్యారు. జిల్లావ్యాప్తంగా రూ. 750 కోట్ల మేర నష్టం వాటి ల్లినట్లు అంచనా. షాద్‌నగర్ పరిధిలోని సోలీపూర్‌లో ఇంటి గోడకూలి సింగపాగ చెన్నయ్య (60) అనే వృద్ధుడు మృతి చెందాడు.

అమ్రాబాద్ మండల పరిధిలోని లక్ష్మపూర్(బీకే)కి చెందిన మూడావత్ లక్ష్మణ్(55)అనే వ్యక్తి వర్షానికి తడిసి మృతి చెందాడు.  నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి డివిజన్‌ల పరిధిలోని దాదాపు 2.8 లక్షల ఎకరాల్లో పంటలు నీటి పాలయ్యాయి. పత్తి, మొక్కజొన్న, వరి, జొన్న, ఆముదం పంటలకు రూ. 550 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. జిల్లా వ్యాప్తంగా 2200 వరకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినగా, చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి, 30 వరకు పశువులు మృతి చెందాయి, ఈ కారణంగా మరో రూ. 200 కోట్ల మేర నష్టం కలిగినట్లు సమాచారం.
 
 పెద్దవాగులో వ్యక్తి గల్లంతు
 అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి సమీపంలో ప్రవహిస్తున్న పెద్దవాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. రోడ్డుపై ఉధృతంగా పారుతున్న పెద్దవాగును తాడు సహాయంతో ముగ్గురు వ్యక్తులు దాటుతుండగా, తాడు తెగిపోవడంతో వారు వాగులో కొట్టుకుపోతుండగా స్థానికులు ఇద్దరిని వెంటనే రక్షించగలిగారు. వాగు మధ్యలో ఉన్న వెంకటయ్య వరద ఉధృతికి కొట్టుకుపోయి, గల్లంతయ్యాడు.
 

మరిన్ని వార్తలు