టీడీపీకి చేయిచ్చిన మాజీ ఎమ్మెల్యే

23 Nov, 2013 04:51 IST|Sakshi
టీడీపీకి చేయిచ్చిన మాజీ ఎమ్మెల్యే

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సహా ఆ పార్టీ జిల్లా నాయకులకు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు పెద్ద ఝలక్ ఇచ్చారు. ఎన్టీయార్ ట్రస్ట్‌భవన్‌లో అధినేత సమక్షంలో పార్టీలో చేరేందుకు నిర్ణయించిన ముహూర్తానికి సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి పత్తా లేకుండా పోయారు. సుమారు రెండు గంటల పాటు ఆయన కోసం దేశం నేతలు చేయని ప్రయత్నం లేదు. ఇక లాభం లేదనుకుని బాబు దగ్గర నుంచి చల్లగా జారుకున్నారు. ఏదో ఒక రకంగా మాజీ ఎమ్మెల్యేను పార్టీలో  చేర్చుకునేందుకు జిల్లా టీడీపీ నేతలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో ఖంగుతిన్నారు. ఈ నెల మొదటివారంలో జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు టీడీపీ నేతలు కొద్దిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఒకరికి ఎర వేశారు. వ చ్చే సాధారణ ఎన్నికల్లో కోవూరు అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తామని టీడీపీ ముఖ్య నేతలు గట్టి హామీ ఇచ్చారు. పలు దఫాలు సంప్రదింపుల తరువాత టికెట్ ఇప్పిస్తారన్న నమ్మకంతో పార్టీలో చేరేందుకు ఆయన అంగీకరించారు. ఆ మేరకు ముహూర్తం ఖరారయ్యింది. అయితే తెలుగుదేశం హైకమాండ్‌లో తనకున్న పలుకుబడితో చంద్రబాబు కోటరీలో ఒక ముఖ్యునికి మాజీ ఎమ్మెల్యే తన చేరిక విషయాన్ని వివరించారు.
 
ఇప్పటికే జిల్లా పార్టీ నాయకులంతా కోవూరు నియోజకవర్గానికి ఒక పేరును సిఫార్సు చేసి ఉన్నందున మరోసారి చెక్ చేసుకోవాలని సూచించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఆలోచనలో పడ్డారు. తీరా విచారిస్తే తన కన్నా ముందే మరొకరికి కూడా టికెట్ ఇప్పిస్తామన్న హామీ ఇచ్చినట్టు గుర్తించారు. దీంతో పార్టీలో చేరికకు మూహూర్తం నిర్ణయించిన రోజు ఉదయం వరకు అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకో గంట సమయం ఉందనంగా ఫోన్‌స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయారు. ఆయన కోసం దాదాపు రెండు గంటల పాటు వెదికే ప్రయత్నం చేసినప్పటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో అప్పటివరకు ఎంతో ఉల్లాసంగా ఉన్న జిల్లా నాయకుల ముఖాలు వాడిపోయినట్టు తెలిసింది. మొత్తానికి దేశం నేతలకు మాజీ ఎమ్మెల్యే ఝలక్ ఇచ్చిన తీరు ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
 
కోవూరు టీడీపీ శ్రేణుల్లో గందరగోళం
కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ నాయకత్వ లోపం వారిని వెంటాడుతోంది. గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయిన తరువాత నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో పాటు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడంలోనూ పార్టీ చొరవ తీసుకోవడం లేదనే ఆందోళన ఆ పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా కొత్త వ్యక్తులను అప్పటికప్పుడు దిగుమతి చేస్తే ఉప ఎన్నికల ఫలితాలే మళ్లీ పునరావృతం అవుతాయని టీడీపీ కార్యకర్తలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు