కాపు కార్పొరేషన్‌ ఎండి బదిలీపై స్పందించిన ఐవైఎఆర్‌

16 Oct, 2017 12:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాపు కార్పొరేషన్‌ ఎండి బదిలీపై ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు సోషల్‌ మీడియాలో స్పందించారు. మీడియాకు లీకులు ఇచ్చి అధికారులను బదిలీ చేయడం చంద్రబాబు వ్యూహంలో భాగమని ఆయన సోమవారం తన ఫేస్‌బుక్‌లో  పేర్కొన్నారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బ తీసేలా బదిలీలు జరుగుతున్నాయని  ఆయన  వ్యాఖ్యానించారు.  కాపు కార్పొరేషన్‌ ఎండీగా పనిచేసిన అమరేందర్‌ చాలా మంచివ్యక్తి అని, ఆయనను ప్రభుత్వం పదవి నుంచి తొలగించడం సరికాదన్నారు.  అయితే అమరేందర్‌ ఆ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ, ఆయన ఇప్పటికీ ప్రభుత్వంలోనే ఉన్నారని, అందుకే తాజా పరిణామాణలపై అమరేందర్‌ నోరు తెరవలేరన్నారు. చంద్రబాబు చెప్పింది చేయకపోతే ఇలాగే ప్రవర్తిస్తారంటూ ఐవైఆర్‌ మరోసారి ధ్వజమెత్తారు.

కాగా ఏపీ కాపు కార్పొరేషన్‌ కార్యాలయంలో హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే. కార్పొరేషన్ ఎండీగా ఉన్న అమరేందర్‌ను ప్రభుత్వం బాధ్యతల నుంచి తొలగించింది. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు అమరేందర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. అయితే అమరేందర్ ప్రెస్‌మీట్ పెట్టడాన్ని కాపు కార్పొరేషన్‌ చైర్మన్ రామానుజయ అడ్డుకున్నారు. తనకు  ప్రెస్‌మీట్ పెట్టుకునేందుకు సీఎంవో నుంచి ఆదేశాలున్నాయని అమరేందర్‌ చెప్పడంతో తాను కూడా ప్రెస్‌మీట్‌లోనే కూర్చుంటానంటూ రామానుజయ పట్టుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే బయటే ప్రెస్‌మీట్ పెట్టుకుంటానని అమరేందర్‌ వెళ్లిపోయారు. అనంతరం ఆయన కాపు కార్పొరేషన్ కార్యాలయం వెలుపల ప్రెస్‌మీట్ పెట్టారు.  వ్యక్తిగత ద్వేషంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే తనపై కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించారని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనకుందన్నారు.

మరిన్ని వార్తలు