కోటయ్య ఇంటికి చేరుకున్న నిజనిర్ధారణ కమిటీ సభ్యులు

20 Feb, 2019 12:22 IST|Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలోని కొండవీడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీసీ రైతు కోటయ్య మృతికి గల వాస్తవాలను వెలికితీసేందుకు యడ్లపాడు మండలం పుట్టకోట పర్యటనకు వెళ్లిన వైఎస్సార్‌ సీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించిన పోలీసులు వారిని గ్రామంలోకి వెళ్లనీయలేదు. దీంతో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్సార్‌ సీపీ నేతలు తమ వాహనాలను అక్కడే వదిలేసి గ్రామంలోకి నడుచుకుంటూ వెళ్లారు. వైఎస్సార్‌ సీపీ నేతలు వెళ్లిన పావుగంట తర్వాత పోలీసులు కొండవీడులోకి వాహనాలను అనుమతిచ్చారు. (రైతును మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ..)

బీసీ రైతు కోటయ్య ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్లిన నిజనిర్థారణ కమిటీ సభ్యులు.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. అంతేకాకుండా కోటయ్య మృతికి గల కారణాలను వారిని అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొండవీడు పర్యటన రోజు రైతు కోటయ్య అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కోటయ్య మృతిపై ఎన్నో రకాల అనుమానాలు తలెత్తడంతో.. వాస్తవాలను గుర్తించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు.  ఉమ్మారెడ్డి ఆధ్వర్యంలోని ఈ నిజనిర్ధారణ కమిటీలో పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మహ్మద్‌ ముస్తఫా, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని, మర్రి రాజశేఖర్, విడదల రజని, లావు శ్రీకృష్ణదేవరాయలు, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, గాంధీ సభ్యులుగా ఉన్నారు.

మరిన్ని వార్తలు