రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి బలిరెడ్డి మృతి

27 Sep, 2019 21:21 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు బలిరెడ్డి సత్యారావు మృతిచెందారు. ఆర్కే బీచ్ రోడ్డులో వాకింగ్‌ చేస్తుండగా ఓ బైక్‌ ఆయన్ని ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బలిరెడ్డిని మై క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. చోడవరం మండలం పీఎస్‌ పేటకు చెందిన సత్యారావు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. భారీగా సాగునీటిని అందిస్తున్న పెద్దేరు రిజర్వాయర్‌ నిర్మాణం ఆయన హయాంలోనే జరిగింది.

బలిరెడ్డి మృతిపై పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్‌, తిప్పల నాగిరెడ్డి, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ప్రసాద్‌రెడ్డిలు బలిరెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు.  

బలిరెడ్డి మృతి పట్ల సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్ర్భాంతి
మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బలిరెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. బలిరెడ్డి ప్రజలకు ఎనలేని సేవలందించారని సీఎం వైఎస్‌ జగన్‌ కొనియాడారు. ముఖ్యంగా చోడవరం నియోజకవర్గానికి ఆయన మరణం తీరని లోటని అన్నారు. 

మరిన్ని వార్తలు