బాబూ..! ఎప్పుడు ఏం జరుగుతుందో !!

26 Aug, 2014 03:14 IST|Sakshi

నెల్లూరు(పొగతోట): అత్యధిక సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ గిలగిల కొట్టుకుంటూ గద్దె దిగారు. ఏ రోజు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసంటూ నెల్లూరు రూరల్ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పరోక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీలో ఆనం సోదరుల చేరికకు బాబు నిరాకరించినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతున్న సమయం లో వివేకా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తొలగించిన హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు మాజీ ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు.

సోమవారం ఆయన దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడమంటే ఉరి తీయడమేనన్నారు. పండగల రోజుల్లో ఉద్యోగుల కడుపుకొడితే వారి ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. ఇక ఐదేళ్లు ఎన్నికలు లేవు కదా అని ప్రజలు, ఉద్యోగులతో ప్రభుత్వం ఆడుకుంటున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు.

రెండు వేల మంది ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేక తొలగించడం దారుణమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది మరొకటిలా ఉందన్నారు. అనంతరం తొలగించిన ఉద్యోగులు వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు మీదనే భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో వివేకా వెంట కాంగ్రెస్ నాయకులు ఆసిఫ్‌పాషా, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నాయకులు సునీల్‌కుమార్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు