నెలాఖరులోగా వైఎస్సార్‌ సీపీలోకి

16 Dec, 2018 11:32 IST|Sakshi
బాలినేనికి పుష్పగుచ్ఛం ఇస్తున్న అన్నా రాంబాబు

మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు

ఒంగోలు: ఈనెలాఖరులోగా మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకొని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనునున్నట్లు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. అన్నా రాంబాబు శనివారం సాయంత్రం ఒంగోలులోని బాలినేని నివాసానికి చేరుకొని ఆయనతో కొద్దిసేపు చర్చించారు. అనంతరం రాంబాబు బయట మీడియాతో మాట్లాడుతూ నెలాఖరులోగా గిద్దలూరులోని నేతలు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్‌ సీపీలో అధికారికంగా చేరతామన్నారు. ఆయన వెంట గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యనేతలు చెంగయ్య చౌదరి, నరసింహ నాయుడు, అక్కి పుల్లారెడ్డి, కె.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకట నాయుడు, ఎంపీటీసీ సభ్యుడు మౌలాలి, మారం రెడ్డి రామనారాయణరెడ్డి, చదుల్ల వెంకట రమణారెడ్డి, కామూరి రమణారెడ్డి, షేక్‌ సుభాని తదితరులు ఉన్నారు.  

విలువలు లేని పార్టీలో ఉండలేనంటూ..
అన్నా రాంబాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దలూరు శాసనసభ్యునిగా గెలుపొందారు. 2014లో టీడీపీ తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు. వైఎస్సార్‌ సీపీ తరఫున గెలిచిన ముత్తుముల అశోక్‌రెడ్డి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడం పట్ల అన్నా రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. నాయకునికి రాజకీయ విలువలు ముఖ్యమని,   ఫిరాయింపు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవద్దంటూ సీఎం చంద్రబాబునాయుడికి సూచించారు. అయినా  ముత్తుముల అశోక్‌రెడ్డిని పార్టీలోకి తీసుకోవడంతో అన్నా రాంబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ విలువలు లేని పార్టీలో తాను కొనసాగలేనంటూ టీడీపీకి రాజీనామా చేశారు.
తాజాగా ఆయన వైఎస్సార్‌ సీపీలో చేరాలని నిర్ణయం తీసుకొని శనివారం బాలినేనిని కలుసుకుని చర్చించారు. ఈ విషయం తెలిసి జిల్లావ్యాప్తంగా ఉన్న వైశ్య సామాజిక వర్గ ప్రతినిధులు ఫోన్లు చేసి అన్నా రాంబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతించారు.  

మరిన్ని వార్తలు