మాజీ ఎమ్మెల్యే సుందరరామిరెడ్డి కన్నుమూత

7 Feb, 2020 13:21 IST|Sakshi
డాక్టర్‌ సుందరరామిరెడ్డి (ఫైల్‌)

పలువురు ప్రముఖుల సంతాపం

నేడు అంత్యక్రియలు

ఆత్మకూరు: ఆత్మకూరు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్‌ బొమ్మిరెడ్డి సుందర్‌రామిరెడ్డి(85) గురువారం ఉదయం కన్నుమూశారు. ఆత్మకూరు ప్రజలకు వైద్యుడిగా చిరకాల పరిచయం ఉన్న సుందరరామిరెడ్డి తన వైద్యశాలలో చికిత్స కోసం వచ్చిన ఎందరో పేదలకు ఉచిత వైద్య సహాయం అందించారు. ఆ సేవలే ఆయనను రాజకీయంగా తిరుగులేని నాయకుడిగా చేశాయంటే అతిశయోక్తి కాదు. 1935 అక్టోబర్‌ 17వ తేదీ మండలంలోని బట్టేపాడులో జన్మించిన ఆయన చెన్నైలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, కొన్నేళ్లు ఆత్మకూరు, అనంతసాగరంలో ప్రభుత్వ వైద్యునిగా పనిచేశారు. 1970లో ఆత్మకూరులో సొంత వైద్యశాలను ప్రారంభించారు.

1978లో కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు ఎన్నికల్లో శాసన సభ్యునిగా పోటీ చేసిన ఆయన నాటి రాజకీయ ఉద్ధండుడు జనతా పార్టీకి చెందిన జీసీ కొండయ్యపై ఘన విజయం సాధించారు. 1985లో హోరాహోరీగా జరిగిన శాశన సభ ఎన్నికల్లో నాటి బీజేపీ అభ్యర్థి, నేటి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుపై విజయం సాధించారు. అనంతరం 1989 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అభ్యర్థి ఆంజనేయరెడ్డిపై విజయం సాధించారు. సుందరరామిరెడ్డిని గుర్తించిన అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 1991లో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సంస్థ(ఎస్‌ఎఫ్‌సీ) చైర్మన్‌గా పదవినిచ్చి గౌరవించింది. ఈయనకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈయన సోదరుడు(రామకృష్ణారెడ్డి) సైతం ఇతనితో కలసి ఆస్పత్రిలో సేవలందించారు. కుమారులిద్దరు డాక్టర్లుగా రాణిస్తుండగా, మరో కుమారుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఓ సారి ఎమ్మెల్సీగా, జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. 

అంత్యక్రియలు నేడు   
డాక్టర్‌ బి.సుందరరామిరెడ్డి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు ఆత్మకూరులో నిర్వహించనున్నట్లు ఆయన కుమారులు డాక్టర్‌ బి. రవీంద్రనాథ్‌రెడ్డి, డాక్టర్‌ బి.రాజేంద్రనా«థ్‌రెడ్డి, బి.రాఘవేంద్రరెడ్డి తెలిపారు.    

పలువురు సంతాపం
డాక్టర్‌ బి.సుందరరామిరెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్‌ ద్వారా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఫోన్లో కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 

మంత్రి గౌతమ్‌రెడ్డి సంతాపం
డాక్టర్‌ బీఎస్సార్‌ మృతి చెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి లక్నో నుంచి ఒక ప్రకటనలో కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కిలివేటి సంజీవయ్య ఆత్మకూరుకు విచ్చేసి డాక్టర్‌ సుందరరామిరెడ్డి మృతదేహానికి ఘన నివాళులర్పించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరినాయుడు, కొమ్మి లక్ష్మయ్యనాయుడు డాక్టర్‌ మృతదేహానికి నివాళులర్పించారు. 

మరిన్ని వార్తలు