విజయనగరం జిల్లాకు రాజావారి రాజద్రోహం

13 Jan, 2020 07:52 IST|Sakshi

జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తున్న మాజీ ఎంపీ అశోక్‌ 

దశాబ్దాలుగా వెనుకబాటులోనే విజయనగరం జిల్లా 

బలమైన చారిత్రక నేపథ్యం ఉన్నా అభివృద్ధి సున్నా 

ఉత్తరాంధ్రలో రాజధాని ప్రకటనతో చిగురించిన ఆశలు 

అయినా వెనక్కి నెట్టేందుకు టీడీపీ కుయుక్తులు 

అశోక్‌ వైఖరిని తప్పు పడుతున్న జిల్లా వాసులు 

ఎవరికైనా అవకాశం వస్తే సొంత ఊరిని.. తమ ప్రాంతాన్ని... జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికే మొగ్గు చూపుతారు. కానీ జిల్లా తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న అశోక్‌గజపతిరాజు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పదవుల్లో ఉన్నపుడు జిల్లాను పట్టించుకోకపోగా... ఇప్పుడు అభివృద్ధికి అవకాశం వస్తే దానిని వ్యతిరేకిస్తున్నారు. విశాఖ కార్యనిర్వాహక రాజధాని అయితే విజయనగరాభివృద్ధి సాధ్యమని ఎవరినడిగినా చెబుతారు. ఈ జిల్లాకు చెందిన వ్యక్తిగా... జిల్లా ప్రజలవల్ల పలుమార్లు పదవులు అధిష్టించిన నాయకునిగా ఆయన మాత్రం... ప్రజలకు, జిల్లాకు ఇప్పుడు తీరని ద్రోహం చేస్తున్నారు. 

సాక్షి, విజయనగరం : దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన జిల్లాగా మిగిలిపోయిన విజయనగరానికి పాలనావికేంద్రీకరణ ద్వారా విశాఖలో రాజధాని ఏర్పాటు కావడం పెద్ద వరం. దీనివల్ల విజయనగరం జిల్లా రూపురేఖలు మారతాయని, తమ బతుకులు బాగుపడతాయని ఇక్కడి ప్రజలు సంతోషపడుతున్నారు. ఇలాంటి తరుణంలో అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ, రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు సంతకాల సేకరణ చేపట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. రాజుల పాలనలో ఇప్పటికే విజయనగరం పట్టణంతో సహా జిల్లా అభివృద్ధిలో వెనక్కు వెళ్లిపోవడంతో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అశోక్‌ను, ఆయన కుమార్తెను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు. అయినా ఆయన తీరులో మార్పు రాకపోవడంపై జిల్లా ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఓ వైపు విశాఖలో రాజధానికి అక్కడి టీడీపీ నాయకులు మద్దతు తెలుపుతుంటే ఉత్తరాంధ్రలో రాజధాని వద్దంటూ అశోక్‌ వంటి నేతలు సంతకాలు చేయమని ప్రజలను బలవంతం చేయడాన్ని స్థానికులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

చదవండి: ఆగని టీడీపీ ఆగడాలు

 
ఆవిర్బావం నుంచీ వెనుకబాటే... 
1979 జూన్‌ 1న విజయనగరం జిల్లా ఆవిర్భవించింది. అంతకు ముందు ఎందరో రాజుల ఏలుబడిలో శతాబ్దాలపాటు వర్థిల్లింది. చివరి రాజవంశమైన పూసపాటి వంశానికి చెందిన అశోక్‌ గజపతిరాజు పాతికేళ్ళపాటు  శాసనసభ్యుడిగా, 13 ఏళ్ళ పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. మహారాజ అలక్‌ నారాయణ సొసైటీ ఫర్‌  ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (మాన్సాన్‌) ట్రస్ట్‌ ద్వారా ఆస్తులను సంరక్షిస్తూ విద్యాసంస్థలు నడుపుతున్నారు. సింహాచలం దేవస్థానంతో పాటు అనేక ఆలయాలకు అనువంశిక ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన తండ్రి పూసపాటి విజయరామగజపతిరాజు, సోదరుడు పూసపాటి ఆనందగజపతిరాజు కూడా ఎంపీలుగా, మంత్రులుగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అశోక్‌ కుమార్తె అధితి గజపతి రాజకీయ రంగ ప్రవేశం చేసి విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు.

అంటే జిల్లా చరిత్రలో అత్యధిక కాలం ఈ కుటుంబమే రాజకీయ పదవులను అనుభవించింది. రెండున్నర దశాబ్దాలు ఎమ్మెల్యేగా, దశాబ్దానికి పైగా మంత్రిగా ఉన్నపుడు జిల్లాకు ఎంతో మేలు చేసే అవకాశం ఉన్నప్పటికీ అలాంటి ఆనవాళ్ళు మచ్చుకైనా ఎక్కడా కనిపించలేదు. మాన్సాస్‌ ట్రస్ట్‌ ఆస్తులను తన సొంత ఆస్తులుగా భావిస్తూ... యథేచ్ఛగా క్రయ విక్రయాలు సాగిస్తూ నేటికీ తన ఆస్తులను పెంచుకోవడానికి, రక్షించుకోవడానికి మాత్రమే ఆయన తన పదవులను వినియోగించుకున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు.
 
నగరానికి ఆయన చేసిందేమిటి? 
అశోక్‌ గజపతి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉండి కూడా భోగాపురం విమానాశ్రయ నిర్మాణంలో కనీస పురోగతి కూడా సాధించలేకపోయారు. జిల్లా కేంద్రానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సైతం తీసుకు రాలేకపోయారు. జిల్లాలో వైద్య విద్యను ప్రోత్సహించేందుకు మెడికల్‌ కళాశాల ఏర్పాటుచేస్తామన్నా... ఆయన పదవిలో ఉన్నంతకాలం సాధించలేకపోయారు. చివరికి విజయనగరాన్ని సైతం  మురికి కూపంగా మిగిల్చారు. ఆయన ఓటమి తరువాతనే నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఎన్నో ఏళ్ళగా నగరవాసుల తాగునీటి కష్టాలనూ ఆయన తీర్చలేకపోయారు. ఛిద్రమైన రహదారులు, కలుషితమైన చెరువులు ఆయన దృష్టిలోనే లేవు. ఫలితంగా అత్యంత వెనుకబడ్డ జిల్లాల జాబితాలో విజయనగరం మగ్గిపోయింది.  ఇదీ ఇన్నేళ్లలో ఈ జిల్లాకు రాజుగారు చేరిన మేలు. ఇప్పుడు ఆయనే మరోసారి జిల్లా అభివృద్ధి నిరోధకానికి తోడ్పడుతున్నారు. 

వికేంద్రీకరణతోనే విజయనగరాభివృద్ధి 
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ అభివృద్ధి ఒకేచోట కేంద్రీకరింపజేశారు. అమరావతినే కీలకంగా మార్చేస్తున్నారు. దీనివల్ల మిగిలిన ప్రాంతాల అభివృద్ధి కుంటుపడింది. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధిని ఒక ప్రాంతానికి పరిమితం చేయకుండా మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకున్నారు. అమరావతి గౌరవానికి భంగం కలగకుండా ఉత్తరాంధ్రకు పరిపాలనా రాజధాని, రాయలసీమకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని  తీసుకురావాలని యోచిస్తున్న తరుణంలో ఈ ప్రాంతీయుల్లో ఆశలు చిగురించాయి. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎంతో సంబరపడుతోంది. విశాఖలో పరిపాలనా రాజధానిని స్వాగతిస్తున్నామంటూ ఊరూ... వాడా... నినదిస్తోంది. కానీ అశోక్‌ గజపతి మాత్రం ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని, అమరావతే కావాలని నినదించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అశోక్‌ గజపతి, ఆయన అనుచరులు జిల్లా ప్రజలకు చేస్తున్న ఈ ద్రోహాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు.   

మరిన్ని వార్తలు