ముఖేష్‌ అంబానీని అరెస్టు చేయాలి

13 Oct, 2018 12:39 IST|Sakshi

జిల్లాలో రూ.19 వేల కోట్ల గ్యాస్‌ చోరీ

కుక్కకాటు మృతుడు అరుణ్‌కుమార్‌ 

శరీరంపై 78 చోట్ల గాయాలు 

 కారకులకు పదేళ్ల జైలు శిక్ష విధించాలి

 మాజీ ఎంపీ హర్షకుమార్‌ 

తాడితోట (రాజమహేంద్రవరం): జిల్లా నుంచి రూ. 19వేల కోట్ల విలువైన గ్యాస్‌ను చోరీ చేసిన ముఖేష్‌ అంబానీపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ డిమాండ్‌ చేశారు. అమలాపురం అయిల్‌ స్కాంలో నిందితులపై చర్యలు తీసుకునే హక్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని ఆయన పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను గతంలో ముఖేష్‌ అంబానీ దోపిడీపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, సుప్రీం కోర్టులో కేసు వేశానని తెలిపారు.

 ఈ ఆయిల్‌ స్కాం వాస్తమేనని కెనడాకు చెందిన సంస్థ నివేదిక ఇచ్చినా, కేంద్రం నియమించిన షా కమిటీ నిర్థారించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం  స్పందించలేదని ఆరోపించారు. అమలాపురంలో ఆడుకుంటున్న పిల్లలపైకి హోం మంత్రి సోదరుడు సిద్ధప్ప నాయుడు కుక్కను ఉసిగొల్పడంతో 9వ తరగతి చదువుతున్న అరుణ్‌ కుమార్‌ మరణించాడన్నారు. అరుణ్‌ కుమార్‌ శరీరంపై 78 చోట్ల గాయాలు ఉన్నాయని పోస్టు మార్టం రిపోర్టులో వచ్చిందని తెలిపారు. 

అరుణ్‌ కుమార్‌ మృతికి కారకులైన వారికి  పదేళ్ల జైలు శిక్ష విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాట్రావుల పల్లిలో దళిత యువకుడిపై దాడులు చేసిన వారిని అరెస్ట్‌ చేయకపోతే ఈ నెల 16న కాట్రావులపల్లి నుంచి పాదయాత్ర నిర్వహించి జిల్లా జడ్జికి వినతి పత్రం అందిస్తామని తెలిపారు.  కాకినాడలో వంశీధర్‌ అనే విలేకరికి జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీం కార్డు ఏమాత్రం పనికిరాకుండా పోయిందన్నారు. ఆ విలేకరి సొంత డబ్బుతో అత్యవసర వైద్యం చేయించుకున్నప్పటికీ  ప్రాణాలు కోల్పోయాడన్నారు. దండోరా నాయకులు తుత్తరపూడి రమణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు