టీడీపీ వెన్నుపోటు రాజకీయాలు చేస్తోంది

16 Oct, 2018 09:23 IST|Sakshi

పులివెందుల : తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు రాజకీయాలు చేస్తోందని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు. సోమవారం భాకరాపురంలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో ఆయన పులివెందుల వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వైఎస్‌ ప్రమీలమ్మ, కడప పార్లమెంట్‌ బూత్‌ కమిటీల అధ్యక్షుడు పాకా సురేష్‌లతో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని బూత్‌ కమిటీ కన్వీనర్లు, కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బూత్‌ కమిటీ కన్వీనర్లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. టీడీపీకి వైఎస్సార్‌సీపీతో ఎదురుగా నిలబడి ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదన్నారు. అందుకే ఆ పార్టీ అనేక అక్రమ మార్గాలను అన్వేషిస్తోందన్నారు. 

అందులో భాగంగా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడం జరుగుతోందన్నారు. ఈ నెలాఖరులోగా ఓటర్ల మార్పులు, చేర్పులకు తుది గడువు ఉండటంతో రాబోయే రెండు వారాలు బూత్‌ కమిటీ కన్వీనర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టి కొత్త తొలగించిన ఓటర్లను పరిశీలించి జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి బూత్‌ కన్వీనర్‌ తమకు కేటాయించిన బూత్‌ పరిధిలో 50మందికి తగ్గకుండా ఓటర్లను చేర్పించాలన్నారు. వైఎస్‌ మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ బూత్‌ కమిటీ కన్వీనర్లు ఓటర్ల జాబితా పరిశీలనతోపాటు తమ బూత్‌ కమిటీ సభ్యులతో ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే చేపట్టబోయే నవరత్నాల పథకాల గురించి తెలియజేయాలన్నారు. ఓటర్ల లిస్ట్‌ తయారైన తర్వాత మార్చుకునే వీలుండదని, అందువల్ల ఈ రెండు వారాలు బూత్‌ కన్వీనర్లు కీలకంగా వ్యవహరించాలన్నారు. కొత్త ఓటర్లను చేర్చడానికి ఫారం–6, ఓట్ల తొలగింపునకు ఫారం–7, ఓటర్‌ బూత్‌ మార్పునకు ఫారం–8ఏ అప్లికేషన్లు పూరించి తహసీల్దార్‌ కార్యాలయంలో సమర్పించాలన్నారు. 

కడప పార్లమెంట్‌ బూత్‌ కమిటీల అధ్యక్షుడు పాకా సురేష్‌ మాట్లాడుతూ పులివెందుల ప్రాంతంలో ప్రతి ఓటు చాలా విలువైందన్నారు. ఇక్కడి నుంచి ఎంపీ అభ్యర్థికి ఎక్కువ మెజార్టీ తెచ్చుకుంటే మిగిలిన ప్రాంతాలలో ఆ ప్రభావం చూపుతుందన్నారు. కడపలో దాదాపు లక్ష ఓట్లు తొలగించారని.. తిరిగి వాటిని ఓటర్ల జాబితాలో చేర్చే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ రెండు వారాలు బూత్‌ కన్వీనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో తాలుకా బూత్‌ కమిటీల మేనేజర్‌ బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మండల పరిశీలకుడు బలరామిరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చిన్నప్ప, పట్టణ కన్వీనర్‌ వరప్రసాద్, జిల్లా కార్యదర్శి రసూల్‌తోపాటు బూత్‌ కమిటీ కన్వీనర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు