రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారు

11 Nov, 2018 11:36 IST|Sakshi
సాగునీటి విషయమై రైతులతో చర్చిస్తున్న మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

పులివెందుల : రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా మారుస్తోందని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు. శనివారం భాకరాపురంలోని వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం దాదాపు రూ.1.54లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. ఇందులో అత్యధిక భాగంగా తాత్కాలిక కట్టడాలకు, సీఎం కార్యాలయ మరమ్మతులకు, విలాసాలకు ఖర్చు చేసిందన్నారు.

 భవిష్యత్‌లో రాష్ట్ర అవసరాలకు అప్పులు పుట్టనంతగా రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందన్నారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటనలో ఈ ప్రభుత్వం విచారణ చేసే తీరు సరిగా లేదన్నారు. నిందితుడు శ్రీనివాస్‌ పనిచేస్తున్న రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ను పోలీసులు నామమాత్రంగా విచారణ చేశారన్నారు. హర్షవర్ధన్‌ చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్‌లకు అత్యంత సన్నిహితుడు కావడంతో ప్రభుత్వం అతని జోలికి పోలేదన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో చంద్రబాబుకు మైనార్టీలు గుర్తుకు వచ్చారన్నారు. ఇప్పుడు ప్రభుత్వ పదవీ కాలం అయిపోతున్న సమయంలో మంత్రి పదవి ఇవ్వబోతున్నాడన్నారు. 

కృష్ణా జలాలు  అందేలా చూడండి: లింగాల రైతులు  
లింగాల మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, దిగువపల్లె, మురారిచింతల గ్రామాలకు చెందిన రైతులు శనివారం వైఎస్‌ అవినాష్‌రెడ్డిని కలిశారు. తమ కష్టాలను విన్నవించుకున్నారు. కృష్ణాజలాలు త్వరితగతిన అందేలా చూడాలని కోరారు. ఇందుకు స్పందించిన ఆయన నీటి పారుదల శాఖ ఎస్‌ఈ మధుసూదన్‌రెడ్డికి, సీఈ మక్బూల్‌ బాషాలకు ఫోన్‌ ద్వారా రైతుల కష్టాలను తెలియజేశారు.ఎత్తిపోతల పథకాల పెండింగ్‌ పనులు పూర్తి చేసి  సాగునీరు అందించాలని గతనెల 25న పులివెందుల పీబీసీ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా కూడా చేపట్టడం జరిగిందన్నారు. అధికారులు డిసెంబర్‌ నెలాఖరు నాటికి పెండింగ్‌ పనులు పూర్తి చేసి నీరు అందించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు ఇప్పటికే పనులు ప్రారంభించామని వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని ఆయనకు తెలిపారు. 

మరిన్ని వార్తలు