ఓ మహాత్మా, మహర్షీ..

28 Jul, 2015 01:24 IST|Sakshi

తన అద్భుత ఆలోచనలతో యువతను మేలుకొలిపిన అభినవ వివేకానందుడు కలాం. ఆయన ఆకస్మిక మృతి జిల్లా వాసులను కలచి వేసింది. జిల్లాతో ఆయనకున్న అనుబంధాన్ని విద్యాధికులు, రాజకీయవేత్తలు, విద్యార్థులు స్మరించుకుని నివాళులర్పించారు. ఎక్కడో మారుమూల శ్రీకాకుళం జిల్లాకు సైతం నాలుగేళ్ల క్రితం ఆయన తరలివచ్చి ఇక్కడి విద్యార్థిలోకాన్ని ప్రభావితం చేసేలా ఆయన ప్రబోధించిన తీరు నభూతో.. రాజాంలో జీఎంఆర్ ఐటీలో సుదీర్ఘమైన ఆ ఉపన్యాసం ఆ ప్రాంగణంలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆనాడు వేదికపై గంభీరమైన, ఆలోచనాత్మమైన, విజ్ఞానప్రపూర్ణమైన ఆయన మాటలు ఎన్నటికీ మరువలేనివి. ఆరోజు అక్కడ కాలేజీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలోని ప్రతి అంశాన్ని పరిశీలించి ప్రశంసించారు.
 
 రాజాం: కలలు కనండి... సాకారం చేసుకోండి... అంటూ యువతను ప్రభావితం చేసిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాంకు శ్రీకాకుళం జిల్లాతోనూ అనుబంధం ఉంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త గ్రంధి మల్లిఖార్జునరావు రాజాంలో స్థాపించిన జీఎంఆర్‌ఐటీలో 2009 మార్చి 12న నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శాస్త్ర సంకేతిక రంగాల్లో దేశానికి ఎన్నో విజయాలు అందించిన ఆయన రాజాం జీఎంఆర్‌ఐటీకి రావడం ఒక చారిత్రక సంఘటనగానే చెప్పుకోవచ్చు. జీఎంఆర్ ఆహ్వానం మేరకు ఇంజినీరింగ్ పట్టభద్రులకు, అధ్యాపకులకు, శాస్త్ర సాంకేతిక శాస్త్రవేత్తలకు దిశా నిర్దేశం చేసే విధంగా ఆయన కీలక ఉపన్యాసం చేశారు.

ఆయన వస్తున్నారని తెలియగానే జీఎంఆర్ విద్యాసంస్థలకు సంబంధించిన విద్యార్థులతో పాటు ఇతరత్రా విద్యార్థులు పాల్గొని ఆయన ఉపన్యాసంతో స్ఫూర్తి పొందారు. అనంతరం ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో రాజాంలోని పలు విద్యాసంస్థలు నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన పలు సృజనాత్మకత అంశాలను ఆసక్తిగా పరిశీలించి అభినందించారు. సోమవారం ఆయన మృతి పట్ల జీఎంఆర్‌ఐటీ సిబ్బందితో పాటు విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
 

మరిన్ని వార్తలు