కలామ్ మృతికి ‘పశ్చిమ’ దిగ్భ్రాంతి

28 Jul, 2015 02:19 IST|Sakshi

కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి.. అంటూ యూవత్ భారతావనిని చైతన్యవంతం చేసిన మాజీ రాష్ట్రపతి, ప్రపంచ విఖ్యాత శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్  కలామ్ మృతి జిల్లా ప్రజలను కలచి వేసింది. సోమవారం రాత్రి  కలామ్  హఠాన్మరణం చెందారన్న విషయూన్ని తెలుసుకున్న ప్రజలు విషాదంలో మునిగారు. జిల్లాతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని పలువురు గుర్తుచేసుకున్నారు.  కలామ్ మృతి ప్రపంచ శాస్త్ర, సాంకేతిక రంగానికి తీరని లోటన్నారు. పలువురు నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.           - ఏలూరు (ఆర్‌ఆర్ పేట)
 
 భీమవరంపై  కలామ్ ముద్ర
 భీమవరం : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్  కలామ్ అకాల మృతి భీమవరం ప్రాంత ప్రజ లను కలచి వేసింది. శాస్త్రవేత్తగా.. రాష్ర్టపతిగా భీమవరానికి విచ్చేసి ఆయన గడిపిన ఆ మధుర క్షణాలను, కలాం ఆప్యాయ పలకరింపులను ఇప్పటికీ ఈ ప్రాంతవాసుల మదిలో ఎప్పుడు మెదులుతూనే ఉంటాయి. 1996లో శాస్త్రవేత్తగా మొదటిసారి పెదఅమిరంలోని మహాత్మాగాంధీ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన కలాం ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. 2006 జనవరి 9న రాష్ట్రపతిగా అబ్దుల్  కలామ్  ఆయన స్నేహితుడు మహాత్మాగాంధీ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు ఎమ్మార్ రాజు ఆహ్వానం మేరకు రెండోసారి భీమవరం పట్టణాన్ని సందర్శించారు.
 
  మిత్రుడు ఎమ్మార్ రాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో కేన్సర్ రీసెర్చ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి రోగులను ఆప్యాయంగా పలకరించారు. చినఅమిరంలోని బైర్రాజు ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ సిబ్బందితో ముచ్చటించారు. స్థానిక రైతులు, గ్రామస్తులతో మాట్లాడి వారి క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు. అక్కడి నుంచి బీవీ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విష్ణు విద్యాసంస్థలను అబ్దుల్  కలామ్ సందర్శించారు. విద్యాదాత బీవీ రాజు సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అదే క్యాంపస్‌లో స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు.
 
 భీమవరంలో ఇద్దరు మిత్రులు
 అబ్దుల్ కలావ్‌ు భీమవరంతో విడదీయరాని బంధం ఉంది. వైద్యరంగంలో ఎమ్మార్ రాజు మిత్రుడు కాగా, వ్యాపార రంగంలో ఉన్న పద్మశ్రీ బీవీ రాజు కలావ్‌ు ఆప్తుమిత్రుడు. రాష్ర్టపతిగా బాధ్యతలు చేపట్టి భీమవరానికి కలాం వచ్చేనాటికి బీవీ రాజు మృతి చెందగా మరో మిత్రుడు ఎమ్మార్ రాజుతో కలసి బీవీ రాజు స్మారక చిహ్నాన్ని సందర్శించి నివాళులర్పించి తన స్నేహభావాన్ని చాటిచెప్పారు.
 
 జీర్ణించుకోలేకపోతున్నాం : ఇస్రో మాజీ డెరైక్టర్ ప్రసాద్
 మొగల్తూరు : మాజీ రాష్ట్రపతి, అంతరిక్ష శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలామ్ మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని ఇస్రో మాజీ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కలామ్ మృతి విషయం తెలిసి ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యూరు. సోమవారం రాత్రి ఆయన ఫోన్‌లో విలేకరులతో మాట్లాడారు. 1975లో తాను తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో జూనియర్ సైంటిస్ట్‌గా బాధ్యతలు చేపట్టానని గుర్తు చేసుకున్నారు. ఆ సంస్థకు కలామ్ చైర్మన్‌గా వ్యవహరించేవారన్నారు. ఆయన సలహాలు, సూచనలు వల్లే తాను ఇస్రోలో డెరైక్టర్ స్థాయికి వెళ్లగలిగానని ప్రసాద్ చెప్పారు. కలామ్ తమకు స్ఫూర్తిగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు.
 
 మంచిని ప్రోత్సహించేవారు
 కాళ్ల : అబ్దుల్ కలావ్‌ు మంచిని ప్రోత్సహించేవారు. ఆయన మృతి దేశానికి తీరనిలోటు. కలామ్తో నాకు ఏర్పడిన పరిచయం ఇప్పటివరకూ కొనసాగింది. 1996 అక్టోబర్‌లో తమ ఆసుపత్రినికలామ్ తొలిసారిగా సందర్శించారు. సాధారణ సైంటిస్ట్ హోదాలో ఆసుపత్రిని సందర్శించిన కలామ్ ఆ తరువాత రాష్ర్టపతి హోదాలో కూడా సందర్శించడం మాకు గర్వకారణం. దేశం ఒక సైంటిస్టును, ఒక పెద్ద మనిషిని, కోల్పోవడం విచారకరం.                                    - పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు

మరిన్ని వార్తలు