విత్తన కిరికిరి

30 Oct, 2013 03:35 IST|Sakshi

 సాక్షి, నెల్లూరు : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా తయారైంది జిల్లాలోని రైతుల పరిస్థితి. ఈ ఏడాది వరుణుడు కరుణ చూపడంతో సోమశిల, కండలేరు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో లక్షలాది ఎకరాల్లో వరిసాగుకు రైతు కోటి ఆశలతో సన్నద్ధమవుతున్నాడు. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా విత్తనాల విషయంలోనే వారికి సమస్యలు ఎదురవుతున్నాయి.

 రైతులకు పూర్తిస్థాయిలో సబ్సిడీపై విత్తనాలు అందించలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. కేవలం 30 శాతం మంది రైతులకే సబ్సిడీపై వరి విత్తనాలు అందించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మిగిలిన 70 శాతం మంది రైతులు ప్రైవేటు కంపెనీలు, వ్యక్తుల నుంచి అధిక ధర చెల్లించి విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పోసొప్పో చేసి విత్తనాలు కొన్నా వాటి ద్వారా దిగుబడి ఎలా ఉంటుందోనని గతానుభవాల దృష్ట్యా రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
 ఆశనిపాతంలా ప్రభుత్వ నిర్ణయం
 జిల్లా ప్రజల వరప్రదాయిని అయిన సోమశిల జలాశయంలో నీటి నిల్వ మంగళవారం 63 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. నవంబర్‌లో ఇంకా వర్షాలు కురిసే పరిస్థితి ఉండటంతో సోమశిలతో పాటు కండలేరు జలాశయాలు గరిష్ట నిల్వ సామర్థ్యానికి చేరుకుంటాయని రైతులు భావిస్తున్నారు. తదనుగుణంగా ఆయకట్టులో లక్షల ఎకరాల్లో సాగుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలికారుతో పాటు ఎడగారుకు సైతం నీరు అందే అవకాశం ఉండటంతో విత్తనాలకు గిరాకీ పెరిగింది.
 
 ఇరిగేషన్ లెక్కల ప్రకారం సోమశిల పరిధిలో 4,16,640 ఎకరాలు, కండలేరు పరిధిలో లక్ష ఎకరాలకు అధికారికంగా సాగునీరు విడుదల చేయనున్నారు. వీటితో పాటు అనధికారికంగా ఆయకట్టులోనే మరో మూడు లక్షల ఎకరాలు తొలికారు సీజన్‌లో సాగులోకి వచ్చే అవకాశముంది. ఇవిగాక చెరువులు, ఫిల్టర్ పాయింట్ల పరిధిలో వేలాది ఎకరాల్లో పంట సాగుకానుంది. అయితే అధికారులు మాత్రం అధికారికంగా సాగయ్యే ఎకరాల్లో 30 శాతం లెక్కించి కేవలం 1.50 లక్షల ఎకరాలకే సబ్సిడీపై విత్తనాలు అందించనున్నట్లు ప్రకటించారు.
 
 ఈ క్రమంలో సుమారు 7 లక్షల ఎకరాలకు సంబంధించి రైతులు విత్తనాల కోసం ప్రైవేటు కంపెనీలు, వ్యక్తులను ఆశ్రయించాల్సిందే . మొత్తం మీద ప్రభుత్వ నిర్ణయం సన్న,చిన్నకారు రైతులకు ఆశనిపాతంలా మారింది. గతంలో పలువురు రైతులు ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేశారు. పైర్లు ఏపుగా పెరి గినా గింజలు రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయా రు. ఈక్రమంలో బయట విత్తనాలు కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అధిక ధరలు చెల్లించైనా కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
 
 అందుబాటులో 40 వేల క్వింటాళ్ల విత్తనాలు
 అందుబాటులో ఉన్న నీటితో లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తుండగా ప్రభుత్వం కేవలం 40 వేల క్వింటాళ్ల విత్తనాలను జిల్లాకు కేటాయించింది. బీపీటీ 5204 రకం 10 వేల క్వింటాళ్లు, ఎన్‌ఎల్‌ఆర్-3 4449 రకం 15 వేల క్వింటాళ్లు, ఎంటీయూ 1010 రకం విత్తనాలు 15 వే ల క్వింటాళ్లు జిల్లాకు వచ్చాయి. వీటిని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల గోదాముల్లో నిల్వ చేశారు. ఈ విత్తనాలకు కిలోకు 5 రూపాయల చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది.  30 కిలోల బస్తా విత్తనాల ధర బీపీటీ 5204 రకం రూ.870, ఎంటీయూ 1010 ధర రూ. 675, ఎన్‌ఎల్‌ఆర్ 3 4449 ధర రూ.810గా నిర్ణయించారు. ప్రతి బస్తాపై రూ.150 వంతున సబ్సిడీ లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు 6,854 టన్నుల యూరియా, 4,254 టన్నుల డీఏపీ, 16,701 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 1,712 టన్నుల పొటాష్, 1530 టన్నుల సూపర్‌ఫాస్పేట్ రైతులకు అందుబాటులో ఉంచారు. సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎరువులు సరిపోయే అవకాశం లేదు.
 
 నగదు బదిలీ పథకానికి స్వస్తి
 రైతులకు విత్తనాలను సైతం ఈ ఏడాది నగదు బదిలీ పథకం ద్వారా అందించాలని ప్రభుత్వం భావించింది. మొత్తం ధర చెల్లించి విత్తనాలు కొనుగోలు చేస్తే, సబ్సిడీ పోనూ మిగిలిన మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని భావిం చింది. దీనిపై సన్నచిన్న కారు రైతులు ఆసక్తిచూపకపోవడంతో పాతపద్ధతిలోనే విత్తనాలు పంపిణీ చేయనున్నారు.
 
 నేటి నుంచి విత్తనాల పంపిణీ   
 రైతులకు సబ్సిడీపై విత్తనాలను జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా బుధవారం నుంచి పంపిణీ చేస్తాం. మండల వ్యవసాయ అధికారుల నుంచి రైతులు సబ్సిడీ పర్మిట్లు తీసుకొచ్చి విత్తనాలు తీసుకెళ్లవచ్చు. ఎరువులను కూడా రైతుల అవసరాలకు సరిపడా మరిన్ని టన్నులు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటాం.  సుబ్బారావు, జేడీ, వ్యవసాయశాఖ
 

మరిన్ని వార్తలు