అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

21 Feb, 2014 02:29 IST|Sakshi

నెల్లూరు (క్రైమ్), న్యూస్‌లైన్ : అప్పుల బాధ తాళ్లలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కార్తీక్ ఇంటర్నేషనల్ లాడ్జీలోని 304 గదిలో ఆలస్యంగా గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం కందమూరుకు చెందిన డి.అంజయ్య (55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నాలుగేళ్ల కిందట అంజయ్య తన కుమార్తె వివాహం కోసం రూ. నాలుగు లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పు  చెల్లిస్తూ ఉన్నాడు.
 
 రెండేళ్ల కిందట కుమారుడు వివాహం కోసం మరో రూ.2 లక్షలు బంధువుల వద్ద అప్పు తీసుకున్నాడు. ఇటీవల కుమారుడికి ఆరోగ్యం చెడిపోవడంతో వైద్యం కోసం మళ్లీ రూ.2 లక్షలు అప్పు చేశాడు. దీంతో అప్పుల భారం పెరిగి..రుణదాతల నుంచి ఒత్తిడిలు ఎక్కువయ్యాయి. అప్పులు బాధలు తాళలేక సతమతమవుతున్నాడు. దిక్కు తోచక ఈ నెల 15వ తేదీ పనిమీద బయటకు వెళుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి నెల్లూరుకు వచ్చాడు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కార్తీక్ ఇంటర్నేషనల్ లాడ్జీలో 304వ నంబర్ గదిని అద్దెకు తీసుకున్నాడు.
 
 18వ తేదీ సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి తాను అత్యవసర పనిపై ఊరు వెళుతున్నానని, ఫోన్ చేయడం కుదరదని చెప్పాడు. రెండు రోజులుగా గదిలోనే ఉన్నాడు. 19వ తేదీ సాయంత్రం లాడ్జీ సిబ్బంది గది తలుపులు తట్టగా తెరవలేదు. లోపల నిద్రపోతున్నాడేమో అని భావించి వారు మిన్నకుండి పోయారు. గురువారం మధ్యాహ్నం అంజయ్య గది నుంచి తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండటంను గమనించిన లాడ్జీ సిబ్బంది తలుపులు తట్టగా తెరవలేదు. దీంతో నాల్గో నగర సీఐ జి. రామారావు దృష్టికి తీసుకెళ్లారు.
 
 సీఐ తన సిబ్బందితో కలిసి లాడ్జీ వద్దకు చేరుకుని గది తలుపులు పగులగొట్టి చూడగా అంజయ్య ఫ్యాన్‌కు దుప్పటితో ఉరేసుకుని ఉన్నాడు. అతని జేబుల్లో ఉన్న అడ్రస్ కాగితాలు, ఫోన్ నంబర్ల ఆధారంగా విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. లాడ్జీ వద్దకు చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రతాప్‌కుమార్ తెలిపారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా