రైతుకు ‘షాక్’

3 Dec, 2014 01:21 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాపై వరుణుడు అంతంత మాత్రం కరుణించడంతో ఉన్న నీటితో పంటలను సాగు చేసుకునేందుకు రైతన్నలు రబీ సేద్యానికి సిద్ధమయ్యారు. కాలువలు, బోర్లు, బావుల కింద నాట్లుకూడా వేశారు. మరి కొందరు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా.. ఉన్న నీటితో పంటలు గట్టెక్కించుకోవచ్చని భావించారు.
 
 అయితే టీడీపీ ప్రభుత్వం ఆదిలోనే అన్నదాలకు షాక్ ఇచ్చింది. రోజుకు మూడు విడతలుగా కరెంటు సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో మొత్తం 11,15,166 సర్వీసులు ఉంటే.. 1,26,674లు వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా గృహాలు, చిన్న, పెద్ద పరిశ్రమలు వంటి వివిధ రకాల కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. వీటికి రోజుకు మూడు విడతలుగా విద్యుత్ సరఫరా చే స్తున్నారు. మూడు గ్రూపులుగా విభజించి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఏ గ్రూపునకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తిరిగి రాత్రి 10 గంటల నుంచి 1 గంట వరకు.
 
  బీ గ్రూపు వినియోగదారులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు. సీ గ్రూపు వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 వరకు, తెల్లవారుజాము 3 నుంచి 6 గంటల వరకు త్రీఫేజ్ కరెంటు సరఫరా చేస్తున్నారు.
 
  పల్లెల్లో మొదలైన కరెంటు కష్టాలు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు వ్యవసాయానికి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. జనం నమ్మి ఓట్లేశారు. ఓట్లేసుకుని గద్దెనెక్కాక మాటను గట్టనుపెట్టి తనదైన శైలిలో ముందుకుకెళ్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే రెండు రోజులుగా జిల్లాలో విద్యుత్ కోతలు ముమ్మరమయ్యాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కరెంటు వినియోగం పెరిగింది. వ్యవసాయ పనులు ముమ్మరం కావడమే ఇందుకు నిదర్శనమని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. జిల్లాకు 1.05 కోట్ల యూనిట్ల కరెంటు అవసరం. అయితే ప్రస్తుతం 95 లక్షల యూనిట్లు కరెంటు మాత్రం ఇస్తున్నారు. దీంతో కరెంటు కోతలు విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పల్లెల్లో పగలు కేవలం నాలుగు గంటలు మాత్రమే కరెంటు ఉంటోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన సమయం అసలు కరెంటు ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో రాత్రి 10 గంటలకు కరెంటు ఇస్తే.. నివాసాల్లో పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు.
 
 తప్పని తిప్పలు
 కరెంటు కోతలు మొదలవ్వడంతో.. అన్నదాతలు పొలాల వద్ద కాపలా కాయాల్సి వస్తోంది. వేలాది ఎకరాల్లో సాగవుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. ‘చంద్రబాబు పుణ్యమా అని విద్యుత్ మోటార్ల వద్దే ఉండాల్సి వస్తోందని భాస్కరరెడ్డి అనే రైతు ఆందోళన వ్యక్తం చేశారు.
 
 ‘చంద్రబాబు నాయుడు నాణ్యమైన కరెంటు ఇస్తామని చెప్ప మమ్మల్ని మోసం చేశారు. పంటలు కాపాడుకోవడానికి రాత్రుల్లో చేన్ల వద్ద బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. కిరణ్‌కుమార్ ఉన్నన్ని నాళ్లు మాకు తిప్పలు తప్పలేదు.. చంద్రబాబు తొమ్మిది గంటలు కరెంటు ఇస్తామని చెప్పడంతో మేమంతా ఓట్లేశాం. ఆయన కూడా తమను మోసం చేశారని మండిపడుతున్నారు.
 

మరిన్ని వార్తలు