ఆ సొమ్ము నిరుద్యోగులకు అందేనా..!

6 Mar, 2017 12:56 IST|Sakshi
ఆ సొమ్ము నిరుద్యోగులకు అందేనా..!

► ఫార్చ్యూన్‌ కంపెనీ పేరుతో నిరుద్యోగులకు శఠగోపం
► దరఖాస్తు రుసుం పేరుతో రూ.3లక్షలు వసూలు
► కటకటాల్లో నిందితుడు
► తమ సొమ్ము తిరిగి ఇవ్వాలంటున్న నిరుద్యోగులు


నందలూరు: నందలూరులో ఆల్విన్‌ కర్మాగారం ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన జరిగినప్పుడు మండలంలోని ఎంతోమంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఆల్విన్‌ కర్మాగారం ఏర్పాటుకు ఇచ్చారు. మండల వాసులకు ఉద్యోగాలలో మొదటి ప్రాధాన్యత ఇచ్చి భూములకు నష్టపరిహారం ఇస్తామని చెప్పిన హామీ అమలుకే నోచుకోలేదు. ఆ తర్వాత కొంతకాలానికి ఆల్విన్‌ కర్మాగారం మూత పడింది. 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఫార్చ్యూన్‌ కంపెనీ ఏర్పాటు చేస్తామని, రూ.250 కోట్లతో 12 పరిశ్రమలు వస్తాయని వెంకటకృష్ణ అలియాస్‌ సోలార్‌ వెంకట్, అలియాస్‌ వెంకటసుబ్బయ్య నమ్మబలికాడు. దీనికితోడు ఒక్క రోజులోనే రూ.100 చొప్పున సుమారు 3వేల దరఖాస్తులు విక్రయించి రూ.3లక్షల వరకు సొమ్ము చేసుకున్నాడు. దీంతో అతనిపై ఐపీసీ 420, 406 కేసులు నమోదు చేసినట్లు రాజంపేట డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. అయితే వెంకటకృష్ణ నుంచి రూ.2.10 లక్షల నగదు మాత్రమే రికవరీచేసి స్థానిక కోర్టులో హాజరుపరిచారు.

ఆల్విన్‌ పరిశ్రమను కొనుగోలు చేసిన రాజేంద్ర కన్‌స్ట్రక్షన్‌ అధినేత కుమారుడు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీరేంద్రరెడ్డికి తన పరిశ్రమలో ఫార్చ్యూన్‌ కంపెనీ ఏర్పాటు చేయడానికి వెంకటకృష్ణ చేసిన భూమిపూజ, హోమాలు, అతను నిర్వహించిన జాబ్‌మేళా గురించి తెలియదా? అతనికి తెలియకుండానే సుమారు నెలరోజుల నుంచి అక్కడ ఇన్ని పనులు చేయడం సాధ్యమా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు వెంకటకృష్ణ ఏం చేయాలనుకున్నాడో పోలీసులు సమాచారం రాబట్టాల్సి ఉంది. దరఖాస్తు రుసుం పేరుతో వెంకటకృష్ణ తీసుకున్న నగదును తమకు ఎవరు చెల్లిస్తారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వవిప్‌ మేడా మల్లికార్జునరెడ్డి సొంత మండలంలో ఆయనకు తెలియకుండానే ఇంత తతంగం జరిగిందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా ఫార్చ్యూన్‌ కంపెనీ పేరుతో నిరుద్యోగులను బురిడీ కొట్టించిన ఘరానా మోసగాడి నిజస్వరూపాన్ని బట్టబయలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అలాగే నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన సొమ్మును వారికి తిరిగి అప్పగించాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు