వరకట్నం వేధింపుల కేసులో నలుగురు అరెస్టు

3 Feb, 2018 12:47 IST|Sakshi

పాలకొండ రూరల్‌: అత్యాశకు పోయి కట్టుకున్న ఇల్లాలిని అదనపు కట్నం కోసం వేధించి ఆమె మృతికి కారణమైన అత్తింటి కుటుంబం చివరకు కటకటాల పాలైంది. సీతంపేట మండలం గుజ్జి గ్రామానికి చెందిన వివాహిత గత నెల 29న బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం పాలకొండ పోలీస్‌స్టేషన్‌లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీఎస్పీ జి.స్వరూపారాణి కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. గుజ్జి గ్రామానికి చెందిన నారాయణశెట్టి శివకృష్ణకు హిరమండలానికి చెందిన కేతన అలియాస్‌ ప్రశాంతి(22)తో 2017 మార్చిలో వివాహమైంది. నిరుపేద కుటుంబానికి చెందిన కేతన వివాహ సమయంలో వారి బంధువులు చందాలు పోగు చేసి కట్నంగా రూ.40వేల నగదుతోపాటు నాలుగు తులాల బంగారాన్ని అందించారు.

అయితే వరుడి తల్లిదండ్రులు సూర్యనారాయణ, హేమలతలు తోడికోడలైన కుసుమ అదనపు కట్నం తీసుకురావాలని కేతనను 10 నెలలుగా వేధిస్తూ వచ్చారు. ఇటీవల సంక్రాంతి పండగకు కేతనను పుట్టింటికి తీసుకువచ్చిన భర్త శివకృష్ణ తనకు తులం బంగారం ఇవ్వాలని అత్తమామలను అడిగాడు. అంత ఇచ్చుకోలేక వారు కొంత బంగారాన్ని ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని శివకృష్ణ భార్యను పుట్టింట్లో వదిలి వెళ్లాడు. ఈ క్రమంలో కేతన తండ్రి సర్దిచెప్పి కూతుర్ని భర్త వద్దకు చేర్చాడు. తాను అడిగిన బంగారం తేకపోవటంతో మళ్లీ వేధింపులు ప్రారంభం కావడంతో గత నెల 29న కేతన ఇంటి సమీపంలోని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సీతంపేట పోలీసులు దర్యాప్తు పూర్తిచేసి కేతన భర్త, అత్తమామలు, తోటికోడలిని శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు