అయ్యో..ఎంత పని జరిగింది

21 Jan, 2019 12:05 IST|Sakshi

విషపు గుళికలు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగి నలుగురు చిన్నారులకు అస్వస్థత

విష గుళికలు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగి నలుగురు

చిన్నారులకు తీవ్ర అస్వస్థత పరిస్థితి విషమం

శ్రీకాళహస్తిలో ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రూయాకు తరలింపు

చిత్తూరు, బుచ్చినాయుడుకండ్రిగ: విషపు గుళికలు కలిపిన కూల్‌ డ్రింక్‌ తాగి నలుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన ఆదివారం మండలంలోని పట్టాభి గిరిజన కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. పట్టాభి గిరిజన కాలనీ చెందిన ప్రసాద్‌ కుమార్తెలు అశ్విని (5), అమ్ములు (3), పోలయ్య కుమారుడు ప్రవీణ్‌ (6), సుబ్బయ్య కుమార్తె లక్ష్మి (3) ఆదివారం కాలనీ సమీపంలోని మామిడితోటలో ఆడుకుంటూ అక్కడ పాతభవనంలో ఎవరో మద్యం సేవించి వదలి వెళ్లిన కూల్‌డ్రింక్‌ను చూశారు.

అక్కడే ఉన్న డిస్పోజబుల్‌ గ్లాసులో పోసుకుని నలుగురు చిన్నారులు తాగేశారు. కాసేపటికి కడుపులో నొప్పిగా ఉందని ఇంటికి వచ్చి అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. 108లో వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయాకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇదలా ఉంచితే, మామిడితోటలో గుర్తు తెలియని వ్యక్తి మద్యం సేవించి, కూల్‌డ్రింక్‌ బాటిల్‌లో విష గుళికలు కలుపుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి, చివరి నిమిషంలో విరమించుకుని, కూల్‌డ్రింక్‌ బాటిల్‌ వదలి వెళ్లి ఉంటాడని ఎస్‌ఐ రామ్‌మోహన్‌ అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు