వికటించిన వ్యాక్సిన్‌

25 Jun, 2018 11:08 IST|Sakshi
ఆస్పత్రి వద్ద ఆందోళనలో బంధువులు

నలుగురు చిన్నారులకు తీవ్ర అస్వస్థత

ఫోన్‌ చేస్తే స్పందించని ఆరోగ్య కేంద్రం సిబ్బంది

కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స

వివరాలు సేకరించిన ఉన్నతాధికారులు

మెరుగైన వైద్యం అందించాలని వైఎస్సార్‌ సీపీ డిమాండ్‌

లబ్బీపేట (విజయవాడ తూర్పు) : ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కవచంలా పని చేస్తాయని వ్యాక్సిన్‌లు వేయిస్తే.. అవే చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చాయి. వ్యాక్సిన్‌ వేయించిన గంటలోనే చిన్నారులు వాంతులు... విరేచనాలతో పాటు నోటి వెంట నురగ రావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వ్యాక్సిన్‌ వేసిన ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇచ్చినా స్పందించక పోవడంతో ఉరుకులు పరుగులపై కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన నలుగురు చిన్నారులు ధనుష్‌ అఖిల్, సంజీత్, ప్రైజీ, దీక్షిత ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.
కేఎల్‌ రావు నగర్‌కు చెందిన ధనుష్‌ అఖిల్‌కు తొమ్మిది నెలలు నిండటంతో స్థానికంగా ఉన్న ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రానికి వెళ్లి శనివారం ఉదయం మీజిల్స్‌ రూబెల్లా వ్యాక్సిన్‌తో పాటు, జేఈ (జపనీస్‌ ఎన్‌సఫలైజేషన్‌) వ్యాక్సిన్, విటమిన్‌–ఎ సిరప్‌ వేయించారు. ఇంటికి వచ్చిన గంటలోపే వాంతులు, విరేచనాలు కావడంతో ఆందోళనతో తొలుత వన్‌ టౌన్‌లోని మమత హాస్పటల్‌కు, అక్కడి నుంచి గాంధీనగర్‌లోని నోరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెపుతున్నారు.

కేఎల్‌రావు నగర్‌కే చెందిన సంజిత్‌కు తొమ్మిది నెలలు నిండటంతో శనివారం అదే ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ఉదయం వ్యాక్సిన్‌ వేయించారు. గంటన్నర తర్వాత వాంతులు, విరేచనాలతో పాటు, నోటి వెంట, ముక్కులో నుంచి నురగలు రావడంతో ఆందోళనతో ఆరోగ్య కేంద్రానికి ఫోన్‌ చేసారు. మా సమయం అయిపోయింది..  సాయంత్రం రమ్మని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో చేసేది లేక చికిత్స కోసం కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు.
అలాగే, పూర్ణనందపేట పాల బజారులో నివశించే ప్రైజీ, కేఎల్‌రావు నగర్‌ ప్రాంతానికే చెందిన దీక్షితులు సైతం వ్యాక్సిన్‌ వేసిన గంట వ్యవధిలోనే అస్వస్థతకు గురి కావడంతో చికిత్స కోసం కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు.

ఎంఆర్‌ వికటించిందా...
అస్వస్థతకు గురైన నలుగురు చిన్నారులకు 9 నెలలు నిండిన తర్వాత వేసే ఎంఆర్, జేఈఈ వ్యాక్సిన్‌లతో పాటు, విటమిన్‌–ఎ సిరప్‌ వేశారు. అయితే జేఈ వ్యాక్సిన్, విటమిన్‌–ఎ సిరప్‌లు వికటించే అవకాశం లేదని నిపుణులు చెపుతున్నారు. ఎంఆర్‌ వ్యాక్సిన్‌ వికటించడం వలనే అలా జరిగి ఉండవచ్చునంటున్నారు. గతంలో తమిâ¶ళనాడులో సైతం మీజెల్స్‌ వ్యాక్సిన్‌ వికటించినట్లు గుర్తు చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్‌ వేసేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించకున్నా.. వాక్సిన్‌లో నీరు కలిపి ఎక్కువ సేపు ఉంచినా అలా జరిగే అవకాశాలు ఉన్నట్లు చెపుతున్నారు. కాగా, వ్యాక్సిన్‌ వికటించినట్లు తెలుసుకున్న పలువురు చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

అధికారుల ఆరా..
సమాచారం తెలుసుకున్న వైద్య, ఆరోగ్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వాణిశ్రీ, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ అమృత, జిల్లా ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ప్రొగ్రామ్‌ మేనేజర్‌ డాక్టర్‌ సుబ్రహ్మణ్యంతో పాటు, ఇతర అధికారులు నోరి ఆస్పత్రిలోని చిన్నారులతో పాటు, వాక్సిన్‌ వేసిన ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పిల్ల లకు వేసిన వ్యాక్సిన్‌లను, వాటి బ్యాచ్‌ నంబర్లను నమోదు చేసుకున్నారు.

మెరుగైన వైద్యం అందించండి..
వ్యాక్సిన్‌ వికటించి తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని వైఎస్సార్‌ సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌ డిమాండ్‌ చేశారు. గాంధీనగర్‌లోని నోరి హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌ మాట్లాడుతూ ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. చిన్నారుల వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా వ్యాక్సిన్‌ వికటించిందని, ఆరోగ్య కేంద్రానికి ఫోన్‌ చేస్తే సమయం అయిపోయిందని చెప్పారని తల్లిదండ్రులు చెపుతున్నారని, ఈ ఘటనలో వారి పని తీరు ఎలా ఉందో అర్ధమవుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని హితవు పలికారు.

చిన్నారులకు వెలంపల్లి, విష్ణు పరామర్శ
లబ్బీపేట (విజయవాడ ఈస్ట్‌) : వ్యాక్సిన్‌ వికటించి చికిత్స పొందుతున్న నలుగురు చిన్నారులను ఆదివారం వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లాది విష్ణు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నవ్యాంధ్ర రాజధాని, ముఖ్యమంత్రి నివాసం ఉండే నగరంలో పసిపిల్లలు వ్యాక్సిన్‌ వికటించి తీవ్ర అస్వస్థతకు గురైతే ప్రభుత్వం పట్టించుకోక పోవడం సిగ్గుచేటన్నారు. వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం చిన్నారుల వైద్య ఖర్చుల నిమిత్తం వెలంపల్లి శ్రీనివాస్‌ కొంత ఆర్థిక సాయాన్ని తల్లిదండ్రులకు అందజేశారు.  

ఫోన్‌ చేస్తే టైమ్‌అయిపోయిందన్నారు..
వ్యాక్సిన్‌ వేయించి ఇంటికి తీసుకువచ్చిన గంటకే వాంతులు, విరేచనాలతో పాటు, నోటి వెంట నురగలు రావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాం. వెంటనే వ్యాక్సిన్‌ వేసిన ఆరోగ్య కేంద్రానికి ఫోన్‌ చేస్తే ఇప్పుడు టైమ్‌ అయిపోయింది. సాయంత్రం 4 గంటలకు రావాలన్నారు. లేకుంటే ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లండంటూ సమాధానం ఇచ్చారు. అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో చేసేది లేక ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చించాం.– లీల, సంజీత్‌ పెద్దమ్మ

మరిన్ని వార్తలు