కల సాకారం కాకుండానే..

20 Dec, 2017 07:35 IST|Sakshi

తమిళనాడులో రోడ్డు ప్రమాదం..

నలుగురు దుర్మరణం పామిడిలో విషాదం

అందరినీ ఆప్యాయంగా పలకరించే ఆ యువకులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తారనుకున్న వారు విగతజీవులై వస్తున్నట్లు తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు కన్నీటి పర్యంతమవుతన్నారు. నిన్నటి వరకు తమతో మాట్లాడిన వారు ఇక లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నారు.

పామిడి: తమిళనాడులోని తిరుమంగళం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పామిడికి చెందిన పోలీస్‌ బ్రదర్స్‌ పేరం రఘు(30), పేరం రాంప్రసాద్‌(29)తో పాటు క్లాత్‌ మర్చంటర్‌ బీ మధుసూదన్‌రెడ్డి(35), డ్రైవర్‌ కుమ్మర మహేష్‌(24) దుర్మరణం చెందారు. బోర్‌వెల్‌ నిర్వాహకుడు తాటిచెర్ల సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. నాలుగురోజుల క్రితం పామిడి నుంచి శబిరిమలైలో సుబ్రమణ్యం స్వామిని దర్శించుకొని తిరుగుపయనంలో సోమవారం రాత్రి మధురై మీనాక్షి దేవాలయ దర్శనానికి ఐ 20 కారులో వెళుతుండగా తిరుమంగళం వద్ద డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుడు తాటిచెర్ల సుబ్బరాయుడును మధురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లోయలోకి ఎగిరిపడిన రఘు, రాంప్రసాద్, మధుసూధన్‌రెడ్డి, కుమ్మర మహేష్‌ మృతదేహాలను వెలికితీశారు. వాటిని మార్చురీకి తరలించారు. మంగళవారం సాయంత్రం పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. పామిడికి బుధవారం తెల్లవారు జామున చేరుకోనున్నారు. నలుగురి మృతితో పామిడిలోని బొడ్రాయి ప్రాంతం విషాదంలో మునిగిపోయింది.  

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌ఐగా ఎదిగి...
ఎంసీఏ చదివిన రఘు 2011 పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఎస్‌ఐ, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్ష రాశాడు. ముందుగా ఎక్సైజ్‌ పోలీస్‌ ఫలితాలు వచ్చాయి. దాంట్లో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా రఘు సెలెక్ట్‌ అయ్యాడు. అందులో భాగంగా ఆరు నెలలు ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా అనంతపురంలో విధులు నిర్వర్తించాడు. 2013లో 14వ బ్యాచ్‌ ఎస్‌ఐ ఫలితాల్లోనూ ఎస్‌ఐ పోస్టుకు ఎంపికయ్యాడు. మొదటి పోస్టింగ్‌గా షామీర్‌పేట ఎస్‌ఐగా పనిచేశారు. ప్రస్తుతం కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సైబరాబాద్‌ క్రైమ్‌ ఎస్‌ఐగా విధులు నిర్వర్తించేవారు. ఇక తమ్ముడు రాంప్రసాద్‌ డిగ్రీ మధ్యలో ఆపేసి 2009లో మడకశిర కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ధర్మవరం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఐదు నెలల క్రితం విధులకు సెలవు పెట్టి.. పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం రూపంలో పోలీస్‌ బ్రదర్స్‌ను బలిగొనడంతో ఆ కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు చూపరులను కంటితడి పెట్టించాయి.

కానిస్టేబుల్‌ కల సాకారం కాకుండానే..
బీకాం పూర్తి చేసిన కుమ్మర మహేష్‌ కానిస్టేబుల్‌ కావాలని కలలు కనేవాడు. రాతపరీక్ష కోసం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాడు. కానీ విధి వెక్కిరించడంతో అర్ధమార్కులో కానిస్టేబుల్‌ ఉద్యోగం చేజారింది. దీంతో తాత్కాలికంగా కారు డ్రైవర్‌గా వెళ్లేవాడు. ఇంతలోనే మహేష్‌ను మృత్యువు కబళించింది.

కుమారుడి మరణ వార్త తెలియని తల్లి
డిగ్రీ చదివిన బి.మధుసూదన్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని తల్లి నాగలక్ష్మికి తెలపడానికి బంధువులు సాహసించడం లేదు. గతంలో భర్త భోగిరెడ్డి మృతుని తట్టుకోలేక నాగలక్ష్మి స్పృహతప్పి పడిపోయింది. ఇప్పుడు కుమారుడి మరణ వార్త తెలిపితే ఏమవుతుందోనన్న భయంతో చెప్పడానికి ఎవరూ సాహసించడం లేదు. మృతదేహం వచ్చాక చెబుదామన్న నిర్ణయానికి వచ్చారు. బంధువుల ఒక్కొక్కరు ఇంటికి వస్తుండడంతో అనుమానం వచ్చిన భార్య హేమలత, పెద్దకుమార్తె అమృత(8), చిన్న కుమార్తె అనూష(3)లు మధుసూదనరెడ్డితో మాట్లాడించాలని పట్టుబట్టడంతో.. సీరియస్‌గా ఉందని, మాట్లాడలేడని దాటవేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా