అకాల వర్షం: రెండు గ్రామాల్లో పెనువిషాదం

10 Apr, 2020 09:31 IST|Sakshi
నాగేశ్వరరావు మృతదేహాన్ని పరిశీలిస్తున్న మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్, ఎస్పీ రవీంద్రనాథ్‌

సముద్రంలో రెండు వేర్వేరు  ప్రమాదాల్లో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు 

అకస్మాత్తుగా వీచిన పెనుగాలులతో  బోల్తా పడిన బోట్లు 

నలుగురి మృతదేహాలు లభ్యం.. మరో ఇద్దరి కోసం కొనసాగుతున్న గాలింపు 

మృతుల కుటుంబాలను  పరామర్శించిన మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్‌

కృత్తివెన్ను(పెడన): గంగపుత్రులకు ఆధారం సాగరం.. సాయమందించేది వల.. కడుపునింపేది వేట. ఉవ్వెత్తున ఎగసే అలలతోనే నిత్యం పోరాటం చేస్తారు.. కష్టమైనా, నష్టమైనా.. రాత్రయినా, పగలైనా బతుకు పోరు సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటారు. అదే ఆశతో వలలు పట్టుకుని కడలిలోకి వెళ్లారు కృత్తివెన్ను మండల పరిధిలోని మత్స్యకారులు. వేట ముగిసింది. ఇక తిరిగెళ్లి పోదాం అనుకుంటున్న తరుణంలో.. అనుకోని విపత్తు వారి ఆశలను చిదిమేసింది. పెనుగాలి రూపంలో సాగరం మధ్యలో తాండవమాడి వారిని కడలి ఒడిలోకి లాగేసుకుంది.

వారి కుటుంబ సభ్యులను శాశ్వత శోకంలో నింపేసింది. మండల పరిధిలోని మత్య్సకార గ్రామాలైన పల్లెపాలెం, ఒర్లగొందితిప్పలకు చెందిన ఆరుగురు గంగపుత్రులు వేటకు సముద్రంలోకి వెళ్లి గల్లంతయ్యారు. వీరిలో నలుగురి మృత దేహాలు లభ్యం కాగా.. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్‌లు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

ఒకే కుటుంబంలో ముగ్గురు.. 
ఒర్లగొందితిప్ప గ్రామానికి చెందిన జల్లా వెంకటేశ్వరావు (52) అతని కుమారులు దావీదు (23), ఏసురాజు.. వెంకటేశ్వరరావు సోదరుడు జల్లా పెద్దిరాజులు (60) ఇతని కుమారుడు మత్యాలరాజులు బుధవారం రాత్రి సమీపంలోని సముద్రపు ముఖద్వారం వద్దనున్న వలకట్టు వద్ద చేపలవేటకు వెళ్లారు. రాత్రంతా చేపల వేట సాగించి తెల్లవారు జామున ఇంటికి బయలు దేరుతుండగా ఒక్కసారిగా ఉప్పెనలా పొంగిన సముద్రం, ఆపై పెనుగాలులు, వడగండ్ల వర్షంతో ఒక్కసారిగా వారి పడవలు బోల్తాపడ్డాయి.

వెంకటేశ్వరరావు, అతని కుమారుడు దావీదు, సోదరుడు పెద్దిరాజులు సముద్రంలో గల్లంతవగా, ముత్యాలరాజు తాటిపట్టెసాయంతో బయటపడ్డాడు. ఏసురాజు సముద్రం లోపలకి పోగా అదృష్టవశాత్తు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. సోదరులైన వెంకటేశ్వరరావు, పెద్దిరాజుల మృతదేహాలు లభ్యం కాగా వెంకటేశ్వరరావు కుమారుడు దావీదు ఆచూకి తెలియాల్సి ఉంది.  

వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయక.. 
కృత్తివెన్ను పల్లెపాలెంకు చెందిన వారిది మరోగాథ. ఇక్కడ నుంచి 15 మంది బుధవారం రాత్రి గ్రామానికి సమీపంలోని సముద్రపు పాయలో వలకట్లు వద్దకు చేపలకోసం వెళ్లారు. వీరంతా తమ పని పూర్తి చేసుకుని తెల్లవారుజామున తిరుగుపయనమవ్వగా ఒక్కసారిగా పెనుగాలులు వీచడంతో వారి పడవ నీటిలో బోల్తాపడిపోయింది.

దీంతో వారంతా నీటిలో మునిగిపోగా 12 మంది ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా వనమాలి వెంకటేశ్వరరావు (61), మోకా నాగేశ్వరరావు (64), బలగం నరసింహమూర్తి (62)లు నీటిలో మునిగి గల్లంతయ్యారు. వీరిలో రెండు మృతదేహాలు లభ్యం కాగా నరసింహమూర్తి కోసం గాలింపు కొనసాగుతోంది. చనిపోయిన వారు ముగ్గురు 60 ఏళ్లు పైబడిన వారే.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వృద్ధాప్యంలో కూడా వారు సాహసించి ప్రాణాలను ఫణంగా పెట్టి వేటకు వెళ్లి మరణించిన ఘటన అందరిని కలచివేసింది.  

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండ..
వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుంటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే జోగి రమేష్‌తో కలసి కృత్తివెన్ను, ఒర్లగొందితిప్ప గ్రామాలను సందర్శించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఏసురాజు, ముత్యాలరాజులను ప్రమాద ఘటన గురించి వివరాలడిగి తెలుసుకున్నారు. మరణించిన ఒక్కొక్క కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థికసాయం ప్రభుత్వం నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, ఫిషరీష్‌ జాయింట్‌ డైరెక్టర్‌ లాల్‌మహ్మద్, డీడీ రాఘవరెడ్డి, డీఎస్పీ మహబూబ్‌బాషా, బందరు ఆర్డీవో ఖాజావలీ, పార్టీ మండల కని్వనర్‌ గంగాధర్, పార్టీ నాయకులు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు