తీరంలో తీరని శోకం

5 May, 2015 02:52 IST|Sakshi

ఎగసి వచ్చే శోకాన్ని ఉగ్గబట్టుకున్న గుండెలతో, రెప్పల వెనుక మరిగే దుఃఖపు లావాను అదిమిపెట్టుకున్న కన్నులతో నదిలో గాలించిన ఆత్మీయులకు చివరికి తమ వారి కట్టెలే కంటబడ్డాయి. ఆ క్షణంలో వారి క ళ్ల నుంచి అశ్రువులు.. వరదవేళ అఖండ గోదావరి ప్రవాహంలా వెల్లువెత్తాయి. రాళ్లకు సైతం జాలి కలిగేలా వారి రోదన గాలిలో మార్మోగింది. ఆదివారం బడుగువానిలంక, ఆలమూరుల వద్ద గౌతమీపాయలో స్నానం చేయడానికి దిగిన అయిదుగురిపై మాటేసిన మృత్యువు.. జలాన్నే వలగా మార్చి ప్రాణాల్ని కబళించిన విషయం తెలిసిందే. ఈ విషాదం జరిగినప్పటి నుంచీ గాలింపు జరపగా సోమవారం నాలుగు మృతదేహాలు కనిపించాయి. మరొకరి కోసం గాలింపు జరుగుతోంది. గల్లంతైన వారి కుటుంబసభ్యులు, అయినవారు పెద్ద సంఖ్యలో నదీ తీరం చేరుకుని, మృతదేహాలు దొరగ్గానే బావురుమన్నారు.
 
 ఆలమూరు / ఆత్రేయపురం :బడుగువాని లంక వద్ద స్నానానికి దిగిన ముగ్గురు విద్యార్థుల్లో నేల వెంకట పవన్ (13) మృతదేహం అక్కడికి సమీపంలోని ఇసుకలో కూరుకుపోయి ఉండగా కనుగొన్నారు. అనుదీప్ (7) మృత దేహం బడుగువాని లంక పుష్కర్‌ఘాట్ సమీపంలో, సిందుశ్రీ(9) మృతదేహం బడుగువాని లంక శివారు వాడపల్లి లంక వద్ద దొరికారుు. ఈ చిన్నారుల మృతదేహాలను మండపేట సీఐ పుల్లారావు ఆధ్వర్యంలో రామచంద్రపురం ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.  కాగా ఆలమూరు ఇసుక ర్యాంపు వద్ద స్నానానికి వెళ్లి గల్లంతైన ఇద్దరిలో మట్టా వెంకట రమణ (35) మృతదేహం కపిలేశ్వరపురం మండలం తాతపూడి సమీపంలో లభ్యమైంది. మట్టా సురేంద్ర (15) మృత దేహం కోసం రెండు ఇంజన్ బోట్లతో ముమ్మరంగా
 
 గాలిస్తున్నారు. జెడ్పీ చైర్మన్ పరామర్శ
 ఆదివారం  దుర్ఘటనలు జరిగాక బాధిత కుటుంబాలను పరామర్శించిన కొత్తపేట ఎమ్మెల్చే చిర్ల జగ్గిరెడ్డి వారికి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. మృతుల్లో పెద్ద వారి కుటుంబానికి రూ.4 లక్షలు, పిల్లల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించిన సంగతీ విదితమే. కాగా జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు బడుగువానిలంక, జొన్నాడ గ్రామాల్లో బాధిత కుటుంబాలను సోమవారం పరామర్శించారు. ప్రభుత్వపరంగా న్యాయం చేయగలమని హామీ ఇచ్చారు.
 
 మృతుల దహన కార్యక్రమాల నిమిత్తం రూ.2 వేల చొప్పున అందజేశారు. ఢిల్లీలో ఉన్న అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు,  హైదరాబాద్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు ఫోన్‌లో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాల వారికి న్యాయం చేయడానికి ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. కొత్తపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆకుల రామకృష్ణ బాధిత కుటుంబాల్ని పరామర్శించి కొంతమొత్తం ఆర్థిక సాయం అందజేశారు. ఆదివారం రాత్రి నుంచి మృతదేహాల గాలింపులో పాల్గొన్న ఆలమూరు తహశీల్దార్ పి.రామ్మూర్తి సొంతంగా రూ.5 వేలు అందజేశారు.  
 

మరిన్ని వార్తలు