నారాయణలో నిబంధనలకు పాతర

27 Oct, 2018 13:45 IST|Sakshi
హరనాథపురంలోని నారాయణ స్కాలర్‌ మెడికల్‌ క్యాంపస్‌

ఒకే క్యాంపస్‌లోనాలుగు విద్యుత్‌ మీటర్లు

ఒకే క్యాంపస్‌కు నాలుగు విద్యుత్‌ మీటర్లు

విద్యుత్‌ శాఖకు రూ.లక్షల్లో నష్టం

సిబ్బంది పాత్రపై అనుమానాలు

నగరంలోని నవాబుపేటలో ఓ వ్యక్తి ఇల్లు నిర్మించుకున్నారు. తన కుమారుడి కుటుంబంతో పాటు ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. విద్యుత్‌ బిల్లు భారీగా వస్తుండటంతో అదనపు విద్యుత్‌ మీటర్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సరిపడా రుసుమును మీ సేవ ద్వారా చెల్లించారు. ఆ ప్రాంత విద్యుత్‌ లైన్‌మెన్‌కు విషయం తెలపడంతో కొన్ని రోజుల తర్వాత నూతన విద్యుత్‌ మీటర్‌ను తీసుకొచ్చారు. తీరా ఏర్పాటు చేసే సమయంలో సదరు లైన్‌మెన్‌ ఒక భవన సముదాయానికి ఒకే విద్యుత్‌ మీటర్‌ ఉండాలనే నిబంధన విద్యుత్‌ శాఖలో ఉందని, ఈ క్రమంలో రెండో మీటర్‌ను ఏర్పాటు చేయడం కుదరదని తేల్చిచెప్పారు. అయితే నూతన మీటర్‌కు చెల్లించిన నగదు మొత్తాన్ని ఇప్పటికీ ఇంటి యజమానికి ఇవ్వలేదు.

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ఒక భవన సముదాయానికి ఒకే విద్యుత్‌ మీటర్‌ ఉండాలనే నిబంధన సామాన్యులకే తప్ప, మంత్రి స్థాయిలో ఉన్న వారికి వర్తించడంలేదు. నగరంలోని హరనాథపురంలో గల నారాయణ విద్యాసంస్థల్లో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోంది. వాస్తవానికి హరనాథపురంలో నారాయణ బాలురు, బాలికలకు సంబంధించి వేర్వేరు ఇంటర్‌ కళాశాలలు ఉన్నాయి. అదే విధంగా ఇదే ప్రాంతంలో నారాయణ భవన్‌ పేరుతో, నారాయణ మెడికల్‌ అకాడమీ పేరుతో బాలుర, బాలికల స్కాలర్‌ మెడికల్‌ క్యాంపస్‌ను మరో భవనంలో నిర్వహిస్తున్నారు. అయితే ఒకే భవన సముదాయంలో నిర్వహిస్తున్న మెడికల్‌ క్యాంపస్‌కు నాలుగు విద్యుత్‌ సర్వీసులు కలిగిన మీటర్లు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఒకే భవన సముదాయానికి నాలుగు విద్యుత్‌ మీటర్లను విద్యుత్‌ శాఖ సిబ్బంది ఎలా ఏర్పాటు చేశారో అర్థం కావడంలేదు. నిబంధనల మేరకు విద్యాసంస్థలకు సంబంధించిన భవనాలకు విద్యుత్‌ సర్వీస్‌ కేటగిరీ – 2 పరిధి కింద విద్యుత్‌ సర్వీస్‌ను ఇవ్వాలి. అయితే నిబంధనలకు తిలోదకాలివ్వడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కేటగిరీ – 2 ప్రకారం ఇదీ లెక్క..
విద్యాసంస్థలకు విద్యుత్‌ సర్వీస్‌ ఇచ్చే కేటగిరీ – 2 కింద 0 నుంచి 50 యూనిట్ల వరకు ఒక స్లాబ్‌గా నిర్ణయించి ఒక్కో యూనిట్‌కు రూ.3.60గా లెక్కిస్తారు. 51 యూనిట్ల నుంచి 100 వరకు యూనిట్లకు మరో స్లాబ్‌గా పరిగణించి యూనిట్‌కు రూ.6.60 వంతున, 101 నుంచి 150 యూనిట్లకు మరో స్లాబ్‌గా యూనిట్‌కు రూ.7.70, 150 నుంచి 200 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.9.90 లెక్కన బిల్లు వేస్తారు. ఈ లెక్కన 50 యూనిట్ల వరకు వాడితే రూ.358, 100 యూనిట్లు వాడితే రూ.950 వరకు, 150 యూనిట్లు వాడితే రూ.1,800 వరకు 200 యూనిట్లు వాడితే రూ.2,500 వరకు నెల వారీ విద్యుత్‌ బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన హరనాథపురంలోని నారాయణ మెడికల్‌ క్యాంపస్‌కు నెలకు వందలాది యూనిట్ల వినియోగమవుతోంది. దీనికి సంబంధించి రూ.లక్షల మొత్తాన్ని నెలవారీ విద్యుత్‌ బిల్లుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా భారీగా విద్యుత్‌ బిల్లులను చెల్లించకుండా ఉండేందుకు గానూ నిబంధనలకు విరుద్ధంగా అదనపు విద్యుత్‌ మీటర్లను పొందారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సంస్థ ఆదాయానికి భారీగా గండి
నారాయణ విద్యాసంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా అదనపు విద్యుత్‌ సర్వీసులను ఇవ్వడం, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంపై విద్యుత్‌ శాఖ సిబ్బందిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రలోభాలకు లొంగి ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నెలా మీటర్‌ రీడింగ్‌కు వచ్చే సమయంలోనూ ఇలా వ్యవహరిస్తూ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంలేదు. ఈ పరిణామంతో విద్యుత్‌ సంస్థ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.

ఒకే కాంపౌండ్‌లోఒకే సర్వీస్‌ ఉండాలి
ఎలాంటి విద్యాసంస్థలైనా ఒకే కాంపౌండ్‌లో ఉంటే ఒకే విద్యుత్‌ సర్వీస్‌ మీటర్‌ను కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో వివిధ పేర్లతో సర్వీసులు పొందుతారు. ఇలాంటి వాటిపై ఫిర్యాదులు వచ్చినా.. తనిఖీల్లో గుర్తించినా.. ఎక్కువగా ఉన్న మీటర్లను తొలగించి అన్నింటినీ కలిపి ఒకే సర్వీస్‌గా చేస్తాం.: విజయ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఈ

మరిన్ని వార్తలు