లంకంత భవనం.. నలుగురే విద్యార్థులు

23 Jan, 2020 13:30 IST|Sakshi
రాత్రి పూట హాస్టల్‌లో ఉంటున్న నలుగురు బాలికలు వీరే..

రాత్రిపూట బిక్కుబిక్కుమంటున్న బాలికలు

రిజిస్టర్‌లో హాజరు మాత్రం 28 మంది..  

వీరఘట్టం బీసీ బాలికల వసతి గృహంలో కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి 

వీరఘట్టం: లంకంత భవనం.. విశాలమైన గదులు.. అందులో ఉండేది నలుగురే. రిజిస్టర్‌లో మాత్రం 28 మంది ఉన్నట్లు లెక్కలు. రాత్రయితే చాలు మళ్లీ ఎప్పుడు తెల్లవారుతుందిరా దేవుడా అంటూ ఆ విద్యార్థినులు బిక్కు..బిక్కు మంటూ గడుపుతున్నారు. ఇదీ వీరఘట్టం బీసీ బాలికల వసతి గృహంలోని పరిస్థితి. ఇదంతా అధికారులకు తెలిసినప్పటికీ.. కనీసం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇక్కడ చదువుతున్న ఆ నలుగురు బాలికలు తమ బాధలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.

నిధుల స్వాహా!
ఈ వసతి గృహాన్ని ఎంతో అందంగా నిర్మించారు. కస్తూర్బా బాలికా విద్యాలయాలు అందుబాటులోకి రావడంతో బాలికల వసతి గృహంలో అడ్మిషన్లు తగ్గాయి. మనుగడను కాపాడుకునేందుకు హాస్టల్‌ సిబ్బంది కొద్ది మంది బాలికలను చేర్పిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ ఉండేది నలుగురు మాత్రమే.. మిగిలిన 24 మంది బాలికల పేరిట నిధులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నలుగురు కోసం ప్రతి నెలా ప్రభుత్వానికి అయ్యే ఖర్చు: రూ.2.50 లక్షలు
ప్రస్తుతం ఈ వసతి గృహం నిర్వహణకు ప్రతి నెలా రూ.2.50 లక్షల ఖర్చు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ నలుగురు విద్యార్థులతో పాటు వీరిని చూసుకునేందుకు నలుగురు సిబ్బంది ఉన్నారు. ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్‌కు ఇక్కడ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. 

ప్రతి నెలా ఖర్చులు ఇలా..
కరెంటు బిల్లు: రూ.1,000
ఇద్దరు కాంట్రాక్ట్‌ ఉద్యోగులకుఇచ్చే జీతం: రూ.26,500   
వంటి మనిషికి ఇచ్చే జీతం: రూ.60,000  
విద్యార్థులకు మెనూ చార్జీలకింద రూ.1.60 లక్షలు  (కొన్నేళ్లుగా హాస్టల్‌కు రాని విద్యార్థినులకు హాజరు వేసి మెస్‌ చార్జీలు సిబ్బంది స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.)

దగ్గరలో ఉన్నవారు ఇళ్లకు వెళ్లిపోతున్నారు..
ప్రస్తుతం 28 మంది బాలికలు రోజూ భోజనాలు చేస్తున్నారు. వీరిలో రాత్రి పూట ఐదుగురు మాత్రమే ఉంటున్నారు. మిగిలిన వారు అందరూ స్థానికులు కావడంతో రాత్రి పూట ఉండడం లేదు. వారికి ఎంత చెప్పినా వినడం లేదు.– ఐ.దీప్తి, ఇన్‌చార్జి వార్డెన్, బీసీ బాలికల హాస్టల్, వీరఘట్టం   

వచ్చే ఏడాది మూసివేస్తాం
ప్రస్తుతం ఉన్న విద్యార్థినులతోనే హాస్టల్‌ నడుపుతాం. విద్యార్థినుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది హాస్టల్‌ మూసివేస్తాం. ఎంత మంది ఉంటే.. అంత మందికే హాజరు వేసి అక్రమాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటాం.   – బి.కృత్తిక, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి, శ్రీకాకుళం

>
మరిన్ని వార్తలు