కృష్ణానదిలో విషాదం: మృతదేహాలు లభ్యం..

24 Jun, 2018 09:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ఈత కోసం వెళ్లి నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు శనివారం గల్లంతైన విషయం తెలిసిందే. వారి కోసం నిన్న నుంచి తీవ్రంగా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఆ నలుగురిలో చైతన్య రెడ్డి, ప్రవీణ్‌, శ్రీనాథ్‌, రాజ్‌కుమార్‌ మృతదేహాలు లభమయ్యాయి. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మృత దేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మత్స్యకారులకు ఈ మృతదేహాలు దొరికినట్లు సమాచారం. కాలేజీ యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలని మృతుల బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మృతదేహాలను తీసుకెళ్తామని ఆస్పత్రి ముందే కుటుంబ సభ్యులు బైఠాయించారు. మృతదేహాలను తీసుకెళ్లామని పోలీసుల చెప్పిన కూడా వినని విద్యార్థుల బంధువులు.

వరాలివి.. ఆ నలుగురు కృష్ణాజిల్లా కంచికచర్లలోని మిక్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో చదువుతున్నారు. తిరువూరుకు చెందిన నర్సింగ్‌ శ్రీనాథ్‌(19), గుంటూరు జిల్లా చౌపాడుకు చెందిన కారుకట్ల ప్రవీణ్‌(18), కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రంగాపురానికి చెందిన కుప్పిరెడ్డి నాగచైతన్యరెడ్డి(19), విజయవాడ కొత్తపేటకు చెందిన పిల్లా రాజ్‌కుమార్‌(19), పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గురజాల సాయిరామ్‌ పవిత్ర సంగమం వద్దకు వచ్చారు. ప్రవీణ్, శ్రీనాథ్‌ కళాశాల హాస్టల్‌లో ఉంటున్నారు.

మిగిలిన వారు బయట రూమ్‌లో ఉంటున్నారు. సాయిరామ్‌ మినహా మిగిలిన నలుగురు కాలువ కలిసే ప్రాంతంలో స్నానానికి దిగారు. శ్రీనాథ్‌ గ్రిల్స్‌పైకి ఎక్కి విన్యాసాలు చేస్తున్న సమయంలో పట్టుతప్పి కాలువలోకి జారిపోయాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో ప్రవీణ్, చైతన్య, రాజ్‌కుమార్‌ ఒక్కొక్కరుగా నీటిలో కొట్టుకునిపోయారు. ప్రత్యక్షసాక్షిగా ఉన్న సాయిరామ్‌ తన తోటి వారిని కాపాడాలని అక్కడ ఉన్నవారిని వేడుకున్నా నీటి ఉధృతిని చూసి ఎవ్వరూ సాహసించలేదు. 

వారు చూస్తుండగానే విద్యార్థులు మునిగిపోయారు. ప్రమాదం విషయం తెలిసి స్థానికులు, కళాశాల విద్యార్థులు సంగమం ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద గతేడాది నవంబర్‌లో బోటు బోల్తాపడి 22 మంది మృత్యువాత పడ్డ విషయం విదితమే. ఇపుడు అదే ప్రాంతంలో నలుగురు విద్యార్థులు గల్లంతుకావడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

 

మరిన్ని వార్తలు