‘నీట్‌’ టాపర్స్‌లో మనవాళ్లు నలుగురు

6 Jun, 2019 03:16 IST|Sakshi

జాతీయ స్థాయిలో ఖురేషి అస్త్రాకు 16వ ర్యాంక్‌

భాను శివతేజ, శ్రీనందన్‌ రెడ్డిలకు 40, 42వ ర్యాంకులు

తెలంగాణకు చెందిన మాధురిరెడ్డికి 7వ ర్యాంకు

సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు విద్యార్థులు బుధవారం విడుదలైన నీట్‌ ఫలితాల్లో టాప్‌–50లో ర్యాంకులు సాధించి సత్తా చాటారు.  మన రాష్ట్రానికి చెందిన ఖురేషి అస్రా 690 మార్కులతో జాతీయ స్థాయిలో 16వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు దక్కించుకుంది. 685 మార్కులతో పిల్లి భాను శివతేజ జాతీయ స్థాయిలో 40వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్‌ సాధించాడు. మరో విద్యార్థి సొదం శ్రీనందన్‌రెడ్డి 685 మార్కులే సాధించి 42వ ర్యాంక్‌ పొందాడు. తెలంగాణకు చెందిన మాధురిరెడ్డి 695 మార్కులతో జాతీయ స్థాయిలో 7వ ర్యాంక్‌ సాధించి సత్తా చాటింది. మన రాష్ట్రం నుంచి 57,798 మంది నీట్‌కు దరఖాస్తు చేసుకోగా 55,200 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 39,039 మంది అర్హత సాధించారు. తెలంగాణలో 67.44 శాతంతో 33,044 మంది ఉత్తీర్ణులయ్యారు. 

ఈ ఏడాది తగ్గిన ఉత్తీర్ణత శాతం
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ నుంచి 70.72 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. నీట్‌–2018లో 72.55 శాతం మంది క్వాలిఫై అయ్యారు. నీట్‌లో ఉత్తీర్ణతా శాతం ఆధారంగా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో నిలిచింది. కాగా, గతేడాది జనరల్‌ విభాగంలో కటాఫ్‌ మార్కు 107 కాగా ఈసారి 134కు పెరిగింది. ఈ ఏడాది నీట్‌ ప్రశ్నపత్రం సులువుగానే ఉండటంతో ఎక్కువ మంది 500 మార్కులకు పైగానే సాధించారు. అయితే గతేడాది కంటే ఎక్కువ మార్కులు సాధించినా ర్యాంకులు తగ్గాయి. ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లీనాకు గతేడాది 464 మార్కులు రాగా జాతీయ స్థాయిలో 37,050వ ర్యాంక్‌ వచ్చింది. లీనా ఈ ఏడాది నీట్‌లో 500 మార్కులు సాధించినా ర్యాంకు 49,261కి చేరింది. ఇలా చాలామంది 500 మార్కులు దాటినా సీటు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు భారీగా మార్కులు సాధించినా అంచనాకు తగ్గట్టు ర్యాంకులు రాలేదు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో ఒక్కో సీటుకు 16.98 మంది పోటీలో ఉన్నారు. గతేడాది కంటే ఈసారి పోటీ మరింత పెరిగింది. 

తుది ‘కీ’ తో అన్యాయం
మే 29న నీట్‌ ప్రిలిమినరీ ‘కీ’ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. జూన్‌ 1 వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి బుధవారం ఫలితాలతోపాటు తుది ‘కీ’ని ప్రకటించింది. దీనిపై విద్యా నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట విడుదల చేసిన ప్రాథమిక ‘కీ’ కెమిస్ట్రీలో రెండు, ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలకు ఇచ్చిన జవాబులను తుది ‘కీ’లో మార్చినట్లు చెబుతున్నారు. మొదటి ‘కీ’లో ఇచ్చిన జవాబులు సరైనవని, వాటినే మన విద్యార్థులు రాశారని అంటున్నారు. తుది ‘కీ’లో వీటిని మార్చడంతో మన విద్యార్థులకు అన్యాయం జరిగిందని పేర్కొంటున్నారు. ప్రాథమిక ‘కీ’లో వచ్చిన మార్కులు తుది ‘కీ’లో పోయాయంటున్నారు. ఇలా 8 మార్కులు, వాటికి మైనస్‌ మార్కులతో కలిపి 10 మార్కులు విద్యార్థులు కోల్పోయారని వివరించారు. దీంతో ర్యాంకుల్లో భారీ తేడా వచ్చిందంటున్నారు. గతేడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు మొదటి 50 ర్యాంకుల్లో ఏడు ర్యాంకులుంటే, ఈసారి నాలుగు ర్యాంకులే ఉన్నాయన్నారు. 

15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సెలింగ్‌
నీట్‌లో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్‌గా, ఎస్టీ, ఎస్సీ, బీసీలకు 40 పర్సంటైల్‌గా, దివ్యాంగులకు 45 పర్సంటైల్‌గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15% సీట్లను నేషనల్‌ పూల్‌లోకి తీసుకున్నారు. వీటన్నింటినీ అలిండియా కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. నీట్‌ ర్యాంకుల ఆధారంగా రాష్ట్రాల వారీగా మెరిట్‌ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. ఇక రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. ఇందుకోసం రాష్ట్ర స్థాయి నీట్‌ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్‌మెంట్, ఎన్నారై, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు. నిపుణుల అంచనా ప్రకారం.. నీట్‌లో జాతీయ స్థాయిలో 40 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో 1,500 నుంచి 2 వేల లోపు ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారికి కన్వీనర్‌ కోటాలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నీట్‌లో 470 నుంచి 480 మార్కుల వరకు వచ్చిన వారికి కూడా కన్వీనర్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

కార్డియాలజిస్టునవుతా నీట్‌ ఏడో ర్యాంకర్‌ జి.మాధురీరెడ్డి
శిరివెళ్ల: నీట్‌–2019 ఫలితాల్లో కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లెకు చెందిన గంగదాసరి మాధురీరెడ్డి జాతీయ స్థాయిలో 7వ ర్యాంక్‌ సాధించింది.  ఏపీ ఎంసెట్‌లోనూ 5వ ర్యాంకుతో సత్తా చాటింది. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ మెడికల్‌ అకాడమీలో చదువుతూ నీట్‌ రాసిన మాధురి 720 మార్కులకు గాను 695 మార్కులు సాధించి సత్తా చాటింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరతానని, కార్డియాలజిస్టు కావడమే తన లక్ష్యమని తెలిపింది. మాధురి తండ్రి తిరుపతిరెడ్డి ఐటీ కంపెనీలో పనిచేస్తుండగా, తల్లి పద్మ గృహిణి. 

రేడియాలజిస్టునవుతా
నీట్‌ 40వ ర్యాంకర్‌ భానుతేజ 
సాక్షి, విశాఖపట్నం: నీట్‌ ఫలితాల్లో విశాఖ నగరానికి చెందిన భానుతేజ జాతీయ స్థాయిలో 40వ ర్యాంకు సాధించాడు. విశాఖ చైతన్య కళాశాలలో ఇతను ఇంటర్మీడియట్‌ చదివాడు. ర్యాంకు వచ్చిన సందర్భంగా భానుతేజ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ర్యాంకు సాధించడానికి రెండు నెలల పాటు రోజుకు 15 గంటలు కష్టపడి చదివాను. నీట్‌ రాశాక 500 లోపు ర్యాంకు వస్తుందని భావించాను. 40వ ర్యాంకు రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. అమ్మ సూర్యమణి విశాఖ కేజీహెచ్‌లో డాక్టర్‌. నాన్న శ్రీకాకుళంలో ఎంవీ ఇన్‌స్పెక్టర్‌. అక్కలు ఇద్దరూ వైద్యులే. నాకు చిన్నప్పట్నుంచి రేడియాలజీ అంటే ఇష్టం. అందుకే భవిష్యత్తులో రేడియాలజిస్టునవుతాను. నాకు ఉత్తమ ర్యాంకు రావడంలో నా తల్లిదండ్రులు, చైతన్య కాలేజీ అధ్యాపకుల ప్రోత్సాహం ఉంది.’ అని వివరించాడు.  

శ్రీనందన్‌రెడ్డికి ఫిజిక్స్‌లో 180కి 180
కడప ఎడ్యుకేషన్‌:  నీట్‌లో కడపకు చెందిన శ్రీనందన్‌రెడ్డి 42వ ర్యాంకు సాధించాడు. అంతేకాకుండా ఫిజిక్స్‌ సబ్జెక్టులో ఇతను 180కి 180 మార్కులు సాధించాడు. శ్రీనందన్‌రెడ్డి ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. ఇతను కడపలోని సంకల్ప కోచింగ్‌ సెంటర్‌లో ఫౌండేషన్‌ కోర్సులో శిక్షణ తీసుకున్నాడు. శ్రీనందన్‌రెడ్డి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు రామిరెడ్డి, ప్రసూన, సంకల్ప్‌ డైరెక్టర్‌ వంశీ హర్షం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు