కడలి మాటున కంటిదీపాలు

13 Nov, 2018 07:56 IST|Sakshi

కళ్లు  కాయలు కాసేలా ఎదురు చూపులు

రెండు రోజూ కానరాని నలుగురి జాడ

మద్దిలపాలెం( విశాఖ తూర్పు): వయసులో చిన్న వారైనా బాధ్యతలో చాలా పెద్దోలు. కన్నవారికి చేదోడువాదోడుగా ఉండాలనే తపన తప్ప చెడు వ్యసనాలతో జులాయిగా తిరిగే కుర్రాళ్లు కాదు. ఉదయం లేచింది మొదలు ఉపాది కోసం పాకుడాలాడే పిల్లలు. అలాంటి కుర్రాళ్లు కడలి మాటున కనుమరుగు కావడం దుర్గానగర్‌కాలనీ,రజకవీధి కాలనీ వాసులను విషాదంలోకి నెట్టింది. కాలనీవాసులంతా రెండురోజులుగా విషణ్ణ వదనంలో గడుపుతున్నారు.  ఆదివారం నాగుల చవితి కావడంతో 12 మంది స్నేహితలు కలిసి పిక్నిక్‌ పేరుతో యారాడ బీచ్‌కు వెళ్లారు. ఇంటి వద్దే వంటకాలు చేసుకుని మరీ  పయనం అయ్యారు. ఉదయం 11గంటలకు బయలు దేరి వెళ్లిన వారు మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి వచ్చేస్తామని ఇంట్లో వాళ్లకు చెప్పారు. అదే మూడు గంటల సమయంలో ఆరుగురు గల్లంతయ్యారనే పిడుగులాంటి వార్త వినాల్సివచ్చింది. సోమవారం నాటి రజకవీధికి చెందిన దుర్గా, గణేష్‌లు మృతదేహాలు తీరానికి కొట్టుకు వచ్చాయి.  వారి కుటుంబీకుల సమక్షంలో ఆ మృతదేహాలను కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. కాగా ఇంకా వాసు, శ్రీను, రాజేష్, తిరుపతి జాడ సోమవారం రాత్రికీ  కానరాలేదు. దీంతో ఆ నలుగురి కుటుంబాలు  మరింత  దుంఖంలో మునిగిపోయాయి.  వారి జాడ కోసం ఎదురుచూస్తున్నారు.  

పది నిమిషాల ముందు మాట్లాడాడు
మూడు గంటలకు వచ్చేస్తామని సరిగ్గా  ఆదివారం మధ్యాహ్నం 2.50 గంటలకు  చెప్పాడు.  పదినిమిషాల తర్వాత కెరటాల్లో  కొట్టుకుపోయాడనే  దుర్వార్త  తోటి స్నేహితులు చెప్పారు. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. ఉదయాన్నే ఇంటి వద్దే  వంటలు చేయించాడు. మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి వచ్చేస్తామని చెప్పాడు.  సరిగ్గా మూడుగంటలకు పదినిమిషాలు ముందు ఫోన్‌చేసి వచ్చేస్తున్నామన్నాడు. కెరటాలు మా కంటిదీపాలు ఆర్పేశాయమంటూ లక్ష్మి కన్నీంటి పర్యంతమయింది. పీఎంపాలెంలోని పాలిటెక్నికల్‌ కళాశాలలో చదువుతూ పోషణ భారంగా ఉందని భావించి మధ్యలో చదువు మానేశాడు. నాకు తోడుగా ఉండేందుకు ఆటో నడుపుతూ నన్నుపోషిస్తున్నాడు. ఇప్పడు నాకు దిక్కు ఎవరు అంటూ గుండెలు పగిలేలా రోధించింది.

బాధితులకు వంశీకృష్ణ పరామర్శ
యారాడ తీరంలో గల్లంతైన యువకుల ఇళ్లకు వెళ్లి  వారి కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ తూర్పు సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్‌ పరామర్శించారు. జరిగిన సంఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు. తీరంలో ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా  యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు