సీఎం జగన్‌పై ఇష్టంతో సైకిల్‌ కొనుక్కొనే డబ్బులను..

6 Apr, 2020 19:21 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి సాయం అందించడానికి పలువురు తమ వంతు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న ఇష్టంతో ఓ నాలుగేళ్ల చిన్నారి తను దాచుకున్న డబ్బులను(రూ. 971) కరోనాపై పోరాటానికి అందజేశాడు. వివరాల్లోకి వెళితే విజయవాడకు చెందిన నాలుగేళ్ల హేమంత్‌ తను సైకిల్‌ కొనుక్కోవడానికి దాచుకున్న డబ్బులను కరోనాపై పోరాటం చేస్తున్న సీఎం జగన్‌ ఇవ్వాలని తల్లిదండ్రులను కోరారు. దీంతో వాళ్లు హేమంత్‌ను మంత్రి పేర్ని నాని వద్దకు తీసుకువచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆ మొత్తాన్ని మంత్రికి అందజేశారు. ఆ డబ్బును సీఎం సహాయ నిధికి పంపించాలని బాలుడు హేమంత్‌.. మంత్రిని కోరారు. 

తనకు సీఎం వైఎస్‌ జగన్‌ అంటే ఇష్టమని.. అందుకే తాను దాచుకున్న డబ్బులు సీఎం సహాయ నిధికి ఇస్తున్నానని హేమంత్‌ మంత్రి పేర్ని నానికి చెప్పాడు. చిన్న వయసులోనే ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న చిన్నారి హేమంత్‌ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. అంతేకాకుండా హేమంత్‌ కొనుక్కోవాలనుకున్న సైకిల్‌ను తాను కొనిస్తానని బాలుడికి హామీ ఇచ్చారు. కాగా, సీఎం వైఎస్‌ జగన్‌ని చిన్నాపెద్ద తేడా లేకుండా అందరు ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అనేక సందర్భాల్లో ఆయన పిల్లలను అప్యాయంగా దగ్గరికి తీసకుని పలకరించడం మనం చూస్తునే ఉన్నాం. గతంలో కూడా పలువురు చిన్నారులు సీఎం వైఎస్‌ జగన్‌పై తమ ఇష్టాన్ని వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు