నేడు మహానేత నాలుగో వర్ధంతి

2 Sep, 2013 03:04 IST|Sakshi
నేడు మహానేత నాలుగో వర్ధంతి

ప్రజల్ని కుటుంబసభ్యులుగా పరిగణించిన విలక్షణనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి.  అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడడమే పదవికి సార్థకతగా భావించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర సాగించి ప్రజల బాగోగు లను అధ్యయనం చేసిన తన పాలనాకాలంలో అన్ని వర్గాలకూ మేలు చేసే ఎన్నో పథకాలను అమలు చేశారు. ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పింఛన్లు, ఫీజు రీ యింబర్స్‌మెంట్, గృహనిర్మాణం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి పథకాలతో విలక్షణనేతగా, సంక్షేమ ప్రదాతగా ఖ్యాతినొం దారు.
 
 చరిత్రలోనే అరుదైన రీతిలో జలయజ్ఞం పేరిట ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణానికి సంకల్పించారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా రూపొందించాలని అనుకున్నారు. మహిళల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. అందుకే భౌతి కంగా ఈ లోకం నుంచి నిష్ర్కమించినా కోట్లాది హృదయాల్లో దైవసమానునిగా కొలువుదీరారు. హెలికాప్టర్ ప్రమాదం లో మరణించి నాలుగేళ్లయినా నిష్కల్మషమైన నవ్వుతో కూడిన ఆయన మోము జనం మనోఫలకాలపై చెక్కుచెదరకుం డా ఉంది.

సోమవారం రాష్ట్రమంతటా మహానేత వైఎస్ నాలుగో వర్ధంతిని ఘనంగా జరుపుకొనేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.   అనేక ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలకు నివాళులు అర్పించడంతో పాటు అన్నవస్త్రదానాల వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయనున్నారు. వైఎస్ పథకాలతో లబ్ధి పొందినవారంతా ఆయన లేని లోటును జ్ఞప్తికి తెచ్చుకుంటూ అనేక చోట్ల వైఎస్ ఫొటోలు పెట్టుకుని కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు