భలే మంచి చౌకబేరం!

21 Jul, 2018 04:21 IST|Sakshi

విశాఖలో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు 40 ఎకరాలు రూ.406 కోట్ల విలువైన భూమి రూ.13 కోట్లకే 

ఔట్‌ రేట్‌ సేల్‌కు రాసిచ్చేసిన టీడీపీ ప్రభుత్వం

కమిటీ సూచనలను లెక్కచేయని ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి

అమెరికాలోని టెంపుల్టన్‌ ప్రధాన కార్యాలయం కేవలం 10 ఎకరాల్లోనే..

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అత్యంత విలువైన భూములను విదేశీ ప్రైవేట్‌ సంస్థలకు కారుచౌకగా కేటాయించడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పని చేస్తోంది. భూముల అప్పగింత వ్యవహారంలో ఉన్నతాధికారుల అభ్యంతరాలు, సూచనలను సైతం ప్రభుత్వ పెద్దలు లెక్కచేయడం లేదు. ఐటీ కంపెనీల పేరిట ఇష్టారాజ్యంగా తక్కువ ధరకే విలువైన భూములను పరాధీనం చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థకు టీడీపీ ప్రభుత్వం 40 ఎకరాలను అప్పనంగా కట్టబెట్టింది. 

ప్రధాన కార్యాలయం పదెకరాల్లోనే.. 
ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ప్రధాన కార్యాలయం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో కేవలం 10 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, మన రాష్ట్రంలో ఆ సంస్థకు 40 ఎకరాలు కేటాయించవద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ తేల్చిచెప్పింది. తొలుత 10 ఎకరాలు మాత్రమే కేటాయించాలని, ఆ స్థలాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్న తర్వాత అవసరమైతే మరికొంత భూమిని కేటాయించవచ్చని సూచించింది. విశాఖపట్నంలో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు ఇచ్చే భూమి ఎకరా రూ.10 కోట్లకు పైగా పలుకుతోందని, ఆ సంస్థ కోరినట్లు ఎకరా రూ.32.50 లక్షలకే కేటాయించవద్దని స్పష్టం చేసింది. కనీసం ఏపీఐఐసీ నిర్ణయించిన ధర ఎకరా రూ.2.70 కోట్ల చొప్పున అయినా వసూలు చేయాలని కమిటీ పేర్కొంది. 

ఎకరా రూ.32.50 లక్షలకే.. 
పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ చేసిన సూచనలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ పట్టించుకోలేదు. ఫ్రాంక్టిన్‌ టెంపుల్టన్‌ కోరినట్లుగానే ఎకరా రూ.32.50 లక్షల చొప్పున మొత్తం 40 ఎకరాలను ఇచ్చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అంటే రూ.406 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.13 కోట్లకే విదేశీ సంస్థకు దారాదత్తం చేశారన్నమాట. సదరు భూమిని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు తక్షణమే అప్పగించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ శుక్రవారం జీవో జారీ చేశారు. పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సూచించినట్లు ఏపీఐఐసీ నిర్ణయించిన ధరకైనా భూములను కేటాయించి ఉంటే రూ.108 కోట్లు సర్కారు ఖజానాకు వచ్చేవని అధికారులు చెబుతున్నారు. 

కంపెనీలు రాకముందే ఔట్‌ రైట్‌ సేల్‌ 
విశాఖ రూరల్‌ మండలం మధురవాడలో గతంలో పర్యాటక శాఖకు కేటాయించిన సర్వే నంబర్‌ 409లో 28.35 ఎకరాలు, సర్వే నంబర్‌ 381లో 11.65 ఎకరాలను ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు కేటాయించారు. ఇందులో ఆ సంస్థ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేస్తుందని, 2,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. రెగ్యులర్‌ కేటాయింపులతో సంబంధం లేకుండా తక్షణం ఆ 40 ఎకరాలను ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు ఇచ్చేయాలని జీవోలో స్పష్టం చేశారు. ఔట్‌ రైట్‌ సేల్‌కు ఇచ్చేస్తున్నందున ఆ భూమిపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదని అధికారులు అంటున్నారు. ఐటీ పరిశ్రమలు రాకముందే ఔట్‌ రైట్‌ సేల్‌ చేయడం సరైంది కాదని పేర్కొంటున్నారు.  

మరిన్ని వార్తలు